Leading News Portal in Telugu

మోడీ సభకు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు… రాజాసింగ్ ఆసక్తికర ట్వీట్ 


posted on Nov 8, 2023 10:01AM

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రధాని సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. బిజెపి టికెట్ ఇచ్చినప్పటికీ అధికారికంగా సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడంతో రాజాసింగ్ అలకపాన్పు ఎక్కారని ప్రచారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొనకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసినా ఆయన ఎందుకు హాజరుకాలేదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. మోదీ సభ  గోషామహాల్ అసెంబ్లీ పరిధిలో వస్తుంది. గోషామహల్ ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కూడా రాజాసింగ్.అయినప్పటికీ ప్రధాని సభకు రాజాసింగ్ హాజరు కాలేదు. అంతే కాదు పలు బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు ఎమ్మెల్యే రాజా సింగ్ ముగింపు పలుకుతూ ఒక వీడియోను విడుదల చేశారు.పాత కేసులు తిరగదోడి తనను ఏ క్షణాన అయినా అరెస్ట్ చేయవచ్చన్నారు. తనకు ప్రాణహాని ఉందని గన్ పెట్టి కాల్చేసినా బాధపడనని హిందూ మతం కోసం ప్రాణాలర్పిస్తానంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఇగోకు పోయి తనను అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నినట్లు రాజాసింగ్ ఆరోపించారు.తన నియోజక వర్గంలో ఎల్బీ స్టేడియం ఉంది కాబట్టి ఆ ఖర్చంతా తనపై వేస్తారని రాజాసింగ్ అంటున్నారని వార్తలు వస్తున్నాయి. మోడీ సభకు వస్తే కెసీఆర్ అరెస్ట్ చేయిస్తాడని ఆయన ఆరోపించారు.