జగనన్న వదిలిన బాణం రివర్స్!? | jagan arrow sharmila reverse| ycp| campaign| who| sajjala| retard| strong
posted on Nov 8, 2023 9:05AM
మనం వదిలిన బాణం.. మళ్లీ మనకే వచ్చి తగిలితే ఏమౌతుంది. ఇప్పుడు ఆదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీలో. సోమవారం (నవంబర్ 6) వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైయస్ షర్మిల.. హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. అన్ని పార్టీల్లో దొంగలు ఉన్నారని.. కానీ వారు ముఖ్యమంత్రులు కాకూడనీ వ్యాఖ్యానించారు. అలాగే వైయస్ ఫ్యామిలీని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌పై ఆమె తనదైన శైలిలో స్పందించారు. నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజే.. సంబంధం లేదు అన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ఏ సంబంధముందని నా గురించి మాట్లాడుతున్నారు..మేము అయితే సంబంధం లేదనే అనుకుంటున్నాం. కానీ వాళ్లు మాట్లాడుతున్నారంటే… మళ్లీ సంబంధం కలుపుకోవాలనుకొంటున్నారా?.. సంబంధముందనా? ఏమనుకోవాలి? సజ్జల గారే సమాధానం చెప్పాలి.. అసలు కేసీఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్డు అయితే ఆంధ్ర, డబుల్ రోడ్డు అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా.. వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు.. దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జలగారు.. ముందు మీ కథ మీరు చూసుకోండి సార్ అంటూ సాక్షాత్తూ సజ్జలకే వైయస్ షర్మిల తనదైన శైలిలో చురకలంటించారు. సజ్జల మాట్లాడితే.. జగన్ మాట్లాడినట్లే కదా అన్న విలేకరుల ప్రశ్నకు ఎవరికైనా ఇదే సమాధానం అంటూ వైయస్ షర్మిల చాలా ఘాటుగా స్పందించారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో వైరల్ అవుతున్నాయి. గాభరా పెడుతున్నాయి.
నాడు వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణాన్నంటూ సోదరుడు జగన్ కోసం పాదయాత్ర చేశారు.. ఆ తర్వాత జగన్ అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆమె అలుపెరగని పోరాటమే చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే .. సోదరిని పక్కన పెట్టేశారని.. దీంతో ఆమె తన తల్లితో కలిసి పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయి… వైయస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించి.. తన రాజకీయం తాను చేసుకొంటున్న సంగతి తెలిసిందే.
అయితే 2024, మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయని.. ఈ ఎన్నికల వేళ జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేసే వారు ఎవరనే ఓ సందేహం అయితే వైసీపీలో బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ పార్టీకి 151 సీట్లు వచ్చాయంటే.. అందులో తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కష్టంతోపాటు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ మంత్రాంగం ఉందనీ.. అయితే ఇప్పుడు జగన్ కు తల్లి విజయమ్మ కానీ.. సోదరి షర్మిల కానీ ఆయన వెంట లేరని పార్టీ వర్గాలే అంటున్నాయి.
అదే సమయంలో ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారానికి జగన్ తొలి, మలి కేబినెట్లోని మంత్రులు వెళ్లితే.. పార్టీకి పడేవి ఓట్లు కావు.. రాళ్లు అనే చర్చ కూడా వైసీపీలోనే మొదలైందని అంటున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఎలాంటి స్కెచ్ గీసినా.. ఇప్పటికే కోడి కత్తి గాటు, బాబాయి గోడ్డలి పోటు వ్యవహారం పార్టీ అధినేత జగన్ ఫ్యామిలీకి చుట్టుకోవడంతో.. లేని నొప్పులన్నీ లేచి వచ్చినట్లు అయిందంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో నమ్మకం కలిగించడానికి విజయమ్మ, షర్మిలల ఆవశ్యకత ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ తాజాగా సీఎం జగన్‌పైన, ప్రభుత్వ సలహాదారు సజ్జలపైన వైయస్ షర్మిల చేసిన కామెంట్స్‌తో.. పార్టీ విజయం తర్వాత సంగతి.. అసలు పార్టీ కోసం ప్రచారం చేసేవారెవరన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతోందంటున్నారు. పైపెచ్చు షర్మిల ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ తరఫున రంగంలోకి దిగినా, ప్రచారం చేసినా మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కూడా వైసీపీలో కనిపిస్తోంది.