Leading News Portal in Telugu

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట.. క్వాష్ పై సుప్రీం తీర్పు ఎప్పుడంటే? | relief to babu in fibernet case| supreme| quash| petition| verdict| diwali


posted on Nov 9, 2023 11:37AM

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు దిపావళి సెలవుల తరువాతేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్  తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల  ధర్మాసనం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.  కోర్టకు దసరా సెలవుల అనంతరం ఈ తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే తీర్పును  దీపావళి సెలవుల అనంతరం వెలువరించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టులో గురువారం (నవంబర్ 9) ఫెబర్ నెట్ కేసులో  చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. అప్పటి వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. 

కాగా స్కిల్ కేసులో ఏపీ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల నిర్బంధం అనంతరం ఆయన మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. అయితే స్కిల్ కేసులో ఆయన దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్  ను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ ను విచారించిన  జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల  ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సుప్రీం అనుమతిస్తే ఒక్క స్కిల్ కేసే కాదు.. ఆయనపై జగన్ సర్కార్ నమోదు చేసిన  ఇన్నర్ రింగ్ రోడ్డ్, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం పాలసీ సహా అన్ని కేసులూ రద్దౌతాయి.

ఒక వేళ సుప్రీం ఆయన క్వాష్ పిటిషన్ ను తిరస్కరిస్తే.. చంద్రబాబు సీజేఐ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.  స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ.. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది.  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం లో వాదనలు ప్రధానంగా 17ఎ సెక్షన్ పైనే జరిగాయి. స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఎ వర్తిస్తుందని న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.