Leading News Portal in Telugu

కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్.. మామూలుగా లేదుగా?! | congress announce minority declaration| employment| financial| aid


posted on Nov 10, 2023 5:40AM

తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ ప్రతాప్, నాసిర్ హుస్సేన్ చేతుల మీదుగా గురువారం(నవంబర్9) మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల ఆర్ధిక అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను ఆ డిక్లరేషన్ లో పొందుపరిచింది.   ఇప్పటికే రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ లో మైనారిటీల అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలు పొందుపరిచింది.  

ఉద్యోగాలు, విద్య, సంక్షేమ పథకాలలో మైనారిటీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు,  మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌  రూ.4,000 కోట్లకు  పెంపు, అలాగే  మైనారిటీల కోసం ప్రత్యేక  సబ్ ప్లాన్,  నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించడానికి  ఏడాదికి వెయ్యి కోట్లు,  విద్య మరియు ఉపాధి ఈక్విటీకి నిబద్ధత వంటి అంశాలను మైనారిటీ డిక్లరేషన్ లో పొందుపరిచింది.

అలాగే అబ్బుల్ కలా తౌఫా ఏ తలీం పథకం కింద ఎంఫిల్ పూర్తి చేసిన మైనారిటీ యువతకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం,  పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రూ.1 లక్ష, గ్రాడ్యుయేషన్‌కు రూ.25,000, ఇంటర్మీడియట్‌కు రూ.15,000/- మరియు 10వ తరగతికి రూ.10,000 సాయం, తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ని స్థాపించి, మైనారిటీ సంస్థలలో ఖాళీలను భర్తీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ,  మతపరమైన హక్కులు, సంస్కృతి రక్షణ ఇమామ్‌లు, మ్యూజిన్‌లు, ఖాదీమ్‌లు, పాస్టర్‌లు మరియు గ్రంథిలతో సహా అన్ని మతాల పూజారులకు పదివేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకూ గౌరవ వేతనం, వక్ఫ్ బోర్డు భూములు, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్, ఆక్రమణకు గురైన ఆస్తుల రికవరీ, ముస్లిం మరియు క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి,  ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు,  మైనారిటీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు లక్షా 60వేల రూపాయల ఆర్థిక సాయం,  సహాయం, సెట్విన్నైపుణ్యాభివృద్ధి శిక్షణ పునరుద్ధరణ, పాత బస్తీలో మౌలిక సదుపాయాల  అభివృద్ధి చేయడానికి కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి హామీలను కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లో పొందుపరిచింది.