Leading News Portal in Telugu

ప్రభుత్వ అధికారులతో ఎన్నికల ప్రచారం.. జగన్ కొత్త ఎత్తుగడ! | election campaign with officers| jagan| new| plan| why| ap| needs| jagan| brochure| government


posted on Nov 10, 2023 12:22PM

గడ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్,  సామాజిక సాధికార బస్సు యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్, ఇలా  కార్యక్రమం ఏదైనా  ప్రజా స్పందన లేకపోవడమే ఫలితం అన్నట్లుగా మారింది ఏపీలో అధికార పార్టీ వైసీపీ పరిస్థితి.  మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను ప్రజల మధ్యకి వెళ్లేలా వైసీపీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.  ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జనం నేతల మొహం మీదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా ఇళ్లకు రావద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇదిగో మీకు ఇంత సంక్షేమం అందించామని నేతలు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మమ్మల్ని పీడించి పీల్చి పిప్పి చేసి వసూళ్లు చేసిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వడం కూడా గొప్పేనా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తులు, తెచ్చిన అప్పులు, ఆగిపోయిన అభివృద్ధిపై కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు  వైసీపీ నేతలకు మొహం చెల్లడం లేదు. కానీ వైసీపీ పెద్దలు మాత్రం తప్పదు ప్రజల వద్దకు వెళ్లాల్సిందే అంటూ రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని మూడు ప్రాంతాలలో వైసీపీ బస్సు యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ కార్యక్రమానికి కూడా ప్రజల నుండి వ్యతిరేకత రావడమే కాదు, సొంత పార్టీ కార్యకర్తలే మొహం చాటేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ మరో ఎత్తుగడ వేస్తున్నది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం చేసేలా ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  వై  ఏపీ నీడ్స్ జగన్ అనే కార్య‌క్ర‌మాన్ని అధికార పార్టీ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే  ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో నడిపిస్తోంది.  గురువారం (నవంబర్ 9) నుండి ఈ కార్య‌క్ర‌మం క్షేత్ర‌స్థాయిలో అన్ని జిల్లాల‌లో మొదలు కాగా.. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత  ఒక్కరూ కనిపించలేదు. ఎక్కడిక్కడ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ కార్యక్రమంలో కనిపించారు. కెలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర రెవెన్యూ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గోవాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ అధికారులంతా ప్రజల వద్దకు వెళ్లి నాలుగున్నరేళ్లలో  వైసీపీ ప్రభుత్వం అందిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించనున్నారు. ప్ర‌భుత్వం ఏ కుటుంబానికి ఎంత ఖ‌ర్చు చేసింది? కులాలు, మతాల వారీగా ఎన్ని నిధులు కేటాయించారు?  రానున్న ఆరు నెలలలో ఇంకెత సొమ్ము కేటాయించ‌నుంది? అనే విష‌యాల‌ను అధికారులు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. లక్ష్యం

అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నది.  జగన్ సర్కార్ ఇంత అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రచారానికి వాడుకొనే నిర్ణయం తీసుకోవడంపై మేధావులు, పలువురు రిటైర్డ్ అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక జిల్లా యంత్రాంగం మొత్తాన్ని నడిపే ఐఏఎస్ అధికారిని సీఎం జగన్ మోహన్ రెడ్డి  చివరికి ఒక పార్టీ కార్యకర్తను చేసేశారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ కార్యక్రమం కోసం జగన్ సర్కార్ రూపొందించిన బ్రోచర్ కూడా వివాదాస్పదమవుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి 24 పేజీల‌తో ఓ బ్రోచర్ రూపొందించింది జగన్ సర్కార్.  ఈ బ్రోచ‌ర్ రూపొందించేందుకు ప్ర‌భుత్వం రూ.10 కోట్ల‌ పైచిలుకు వ్య‌యం చేసింద‌ని  బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.  దీనిపై ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర పెద్దలు కూడా  ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. 

ఒకవైపు ప్రభుత్వ అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు చేయడం, ఒక్క బ్రోచర్ డిజైన్ కోసమే రూ.10 కోట్ల ఖర్చు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో దుమారం రేపుతోంది. గతంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాగే అధికారులను ఇష్టారాజ్యంగా వాడుకున్నాయి.  బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో మొదట ఈ తరహా ఫార్ములా అవలంబించగా.. ఇప్పుడు ఏపీలో వైసీపీ కూడా అదే ఫార్ములాను నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఇప్పటికే ఎంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు అధికారులతో ఎన్నికల ప్రచారంతో మరింత వ్యతిరేకతను పొందడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విపక్షాలకు ఇది కూడా ఒక అస్త్రం కాబోతుందని అంటున్నారు.