సొంత తల్లి, చెల్లికే నమ్మకం లేదు.. ఇక జనాలు ఎలా నమ్ముతారు? | mother and sister dont belive jagan| will| people| netizens| meemers
posted on Nov 11, 2023 5:49AM
గత ఎన్నికలలోజగన్ మోహన్ రెడ్డికి ఎన్ని అంశాలు కలిసి వచ్చాయో ఇప్పుడు అంతకు మించి మరెన్నో అంశాలు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయాయి. 2019 ఎన్నికల సమయంలో అవినీతి కేసులలో జైలుకు వెళ్లిన సెంటిమెంట్ కలిసి వస్తే.. ఇప్పుడు అదే అవినీతి కేసులు జగన్ కు ప్రతికూలంగా మారాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ నాలుగేళ్లుగా కనీసం విచారణకు కూడా హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని జనం బాహాటంగానే చెబుతున్నారు. కోడికత్తి కేసు, బాబాయ్ హత్యకేసులకు సంబంధించి జగన్ చేసినవన్నీ డ్రామాలే అనేలా ఇప్పుడు ముద్రపడిపోయింది. ఇక అన్నిటికీ మించి గత ఎన్నికలలో జగన్ కు అతి పెద్ద ప్లస్ పాయింట్ కుటుంబం. తల్లి విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జగన్ కు దగ్గర చేసి అండగా ఉండేలా చేశారు. ఇక చెల్లి షర్మిల అయితే అన్న జైల్లో ఉండగా అప్పుడే తొలిసారి ప్రజల మధ్యకి వచ్చి పాదయాత్రతో పార్టీ కార్యకర్తలలో ఒక నమ్మకాన్ని కలిగించారు. ఇక బావ బ్రదర్ అనిల్ కుమార్ కూడా వెనకుండి రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సోదరులను జగన్ వైపు మళ్లేలా చేశారు. కానీ, ఇప్పుడు వాళ్ళెవరూ జగన్ తో లేరు. కారణాలు ఏవైనా కానీ తల్లి, చెల్లి ఇప్పుడు జగన్ తో సంబంధాలు తెంచేసుకుని దూరంగా వెళ్లిపోయారు.
ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. జగన్ విషయంలో కూడా అంతే. బహిరంగ సభలలో ఆయన చిరునవ్వులు చిందిస్తూ తానేం చెప్పినా జనం నమ్మేసి తన వెంటే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. బాబాయ్ వివేకా హత్యకేసు విచారణ, నిందితులను పక్కనే ఉంచుకొని వారికి అండగా నిలవడం, కోడికత్తి కేసులో నిందితుడిని జైలుకు పరిమితమయ్యేలా కోర్టు విచారణకు హాజరు కాకపోవడం వంటివన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక, జగన్ కుటుంబం దూరమవడంపై కూడా ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. తన విజయం కోసం ఎంతో చేసిన చెల్లి షర్మిలను పక్క రాష్ట్రానికి వెళ్లేలా చేయడం, అక్కడ కూడా ఆమె రాజకీయంగా ఎదగకుండా తెరవెనక కుట్రలు చేశారనే ఆరోపణలు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు షర్మిలను విమర్శించడం వెనుక ఉన్న కారణాలు.. ఇలా ప్రతి విషయాన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు.
అందుకే, ఇప్పుడు జగన్ మాట్లాడే ప్రతి మాటను గమనిస్తున్న ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకా హత్యకేసు, కోడికత్తి కేసులకు సంబంధించి జగన్ మాట్లాడిన మాటల వీడియోలను ఇప్పుడు మళ్ళీ షేర్ చేసుకుంటున్న నెటిజన్లు అప్పటికి ఇప్పటికీ తేడాలపై కామెంట్లు చేస్తున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన కార్యక్రమాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఏపీ నీడ్స్ జగన్ లాంటి కార్యక్రమంపై మీమర్లు గట్టి కౌంటర్లు వదులుతున్నారు. ఇక మా నమ్మకం నువ్వే అంటూ కొన్నాళ్ళుగా వైసీపీ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే మొదలైన ఈ కార్యక్రమానికి సంబంధించి స్టిక్కర్లు కూడా తయారు చేయించి వాలంటీర్లతో ఇంటింటికి అంటించేలా చేశారు. అయితే, ఇప్పుడు ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ట్రెండింగ్ లో ఉంది.
మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదానికి నెటిజన్లు కొత్త లాజిక్కులు తెచ్చి ప్రశ్నిస్తున్నారు. జగన్ మీద సొంత తల్లి, చెల్లికే నమ్మకం లేక పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారు.. రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి మరణం ఒక మిస్టరీ అని వైసీపీ నేతలే ఆరోపిస్తారు. బాబాయ్ హత్య చేసింది అబ్బాయిలేనని సీబీఐ ఆధారాలతో సహా తేల్చేసింది. తల్లి కొడుకుతో ఉండలేక కూతురుతో వెళ్ళిపోయింది. సొంత చెల్లి రాష్ట్రం వదిలే వెళ్ళిపోయింది. బాబాయ్ కూతురైన మరో చెల్లి అన్న అధికారంలో ఉన్నా రాష్ట్రంలో న్యాయం దొరకట్లేదని తన తండ్రి హత్యకేసుపై దర్యాప్తు పక్క రాష్ట్రాంలో జరిపించాలని న్యాయపోరాటం చేసి మరీ సాధించుకున్నారు. ఇంత మంది సొంత వారికి నమ్మకం ఇవ్వలేని జగన్ ఇక రాష్ట్ర ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారని.. ఇంకా మా నమ్మకం నువ్వే లాంటి స్లొగన్స్ ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారంటూ మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు. లాజిక్ కరెక్టే కదా అంటూ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. దీంతో ఏపీ సీఐడీని రంగంలోకి దింపిన జగన్ సోషల్ మీడియాలో జగన్ పై వ్యతిరేక పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తామంటూ బెదరిస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు, బెదరింపులకు ఓట్లు రాలతాయా? అని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.