posted on Nov 11, 2023 10:58AM
వైసీపీ కనీసం క్యాడర్ నైనా కాపాడుకోవడానికి వైనాట్ 175 అన్న ప్రచారాన్ని గట్టిగా వాడుకుంటోంది. అయితే అదేమంత సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర కు జనాలు సరే.. పార్టీ కార్యకర్తలు కూడా ముఖం చాటేస్తున్నారు. ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ వైనాట్ 175 అన్న జగన్ నినాదాన్ని నెటిజన్లు సెటైర్లతో ఏకి పారేస్తున్నారు.
సామాజిక బస్సు యాత్ర సభల కోసం పెద్ద సంఖ్యలో కుర్చీలు వేసి ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తుంటే.. ఆ కుర్చీల్లో కూర్చునేందుకు పదుల సంఖ్యలో కూడా జనం ఉండటం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వై నాట్ 175 అనడం తరువాత.. ముందు సాధికార బస్సుయాత్ర సభలలో 175 కుర్చీలు నిండటం లేదు చూసుకోండంటూ ఎద్దేవా చేస్తున్నారు.
వైసీపీ ఇన్ చార్జీలు, పార్టీ స్థానిక నాయకులు, మంత్రులు ఇలా అంతా కలిసి బస్సుయాత్రలు చేస్తున్నా జనం అటుకేసి కూడా చూడటం లేదు.
ఈ తతంగాన్నంతా సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ చేస్తున్న నెటిజన్లు.. జగన్ పదేపదే చెబుతున్న వై నాట్ 175కు అసలైన అర్ధం సామాజిక సాధికార బస్సు యాత్ర సభలలో కనీసం 175 కుర్చీలనైనా నింపండి అనేనా అంటున్నారు. వైసీపీ సభలకు 175 సీట్లు నిండటం లేదు కానీ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించాలంటూ పార్టీ నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే.. ఉట్టికెగరలేనమ్మ సామెత గుర్తుకు వస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు.