Leading News Portal in Telugu

అమరావతి.. పగ పట్టారు.. హస్తిన పొగ పెట్టారు..! | capitals of two states disappeared| amarawati| revenge| delhi| polution


posted on Nov 11, 2023 4:28PM

మనుషులు కనిపించడం లేదంటే అర్థముంది. కానీ.. అదే రాజధానులు కనిపించడం లేదంటే మాత్రం ఆలోచించాల్సిందే. తాజాగా దేశంలో రెండు రాజధానులు కనిపించడం లేదు.. వాటిలో ఒకటి పగ వల్ల.. మరోటి పొగ వల్ల కనిపించకుండా పోయాయి.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జగన్ పగపట్టడం వల్ల కనిపించకుండా పోతే,  దేశ రాజధాని ఢిల్లీ  పొగ వల్ల కనిపించడం లేదంటూ నెటిజన్లు  సెటైర్లు వేస్తున్నారు.  నవ్యాంధ్ర రాజధాని అమరావతి జగన్ కక్ష సాధింపు ధోరణి కారణంగా నాలుగున్నరేళ్ల క్రితం మాయమైంది. 

ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. ప్రతిపక్షనేతగా  జగన్ .. రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ  మాట మార్చారు. అమరావతిని కనుమరుగు చేశారు.  రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల గుండెల్లో చిచ్చు పెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు నిరసన గళం విప్పితే.. ఓ సామాజిక వర్గానికి మాత్రమే ఈ రాజధాని ప్రాంతం కేంద్రీకృతమైందంటూ ఓ వితండ వాదాన్ని  జగన్ పార్టీ తెరపైకి తీసుకు వచ్చింది. 

మరోవైపు తమ భూములు ఇచ్చి అన్నీ కోల్పోయామంటూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అటు తిరుమలలో కొలువైన ఆ దేవ దేవుడు వద్దకు, ఇటు అరసవల్లిలో కొలువు తీరిన ప్రత్యక్ష నారాయణుడు.. సూర్యభగవానుడి చెంతకు  పాదయాత్రలు చేపట్టినా..  జగన్ ప్రభుత్వంలో మాత్రం కదలిక అనేది లేదు.. రాలేదు.  జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిపై   పగ పట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని జనం నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. 

2014లో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో.. 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే 10 ఏళ్ల పాటు ఈ ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని విభజన హామీల్లో స్పష్టం చేసినా.. నవ్యాంధ్రకు సొంత రాజధాని కోసం  అప్పటి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు.. 13 జిల్లాలకు సెంటర్ పాయింట్‌గా.. అంటే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు కరెక్ట్ సెంటర్ పాయింట్ తుళ్లూరు గ్రామంగా గుర్తించి.. ఆ గ్రామానికి పరిసరాల్లో ఉన్న మొత్తం 29 గ్రామాల్లోని ప్రజలు, రైతులతో మాట్లాడి.. వారిని ఒప్పించడంతో.. రాజధానికి వారంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అలా రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబునాయుడు బీజం వేశారు.  రాజధాని అమరావతి శుంఖుస్థాపనకు దేశ ప్రధాని మోదీ,  పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభం అయ్యింది. భవనాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. అసెంబ్లీ, హైకోర్టులు కొలువుదీరాయి. ఆ  దశలో 2019 ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో  జగన్‌ పార్టీకి విజయం సాధించి అధికారం చేపట్టింది. అంతే అమరావతికి గ్రహణం పట్టింది.  మూడు రాజధానుల మూడుముక్కలాటకు తెర లేచింది.    

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో.. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. దీంతో గాలి నాణ్యత బాగా క్షీణించి.. ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దాంతో ఢిల్లీ అంతటా విషపూరిత పొగమంచు కమ్మేయడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు అక్కడి రాష్ట్ర  ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై సుప్రీంకోర్టు సైతం స్పందించింది. కాలుష్య నివారణ చర్యలు ఏం చేపట్టారంటూ.. ఢిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాలను సూప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. 

ఇటువంటి పరిస్థితుల్లో  ఏపీ రాజధాని  అమరావతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పగ వల్ల.. కనిపించకుండా పోతే..  దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాయు కాలుష్యం కారణంగా పొగ కమ్మేసి  కనిపించకుండా పోయిందని అంటున్నారు.