రేవంత్ విద్యుత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు చిక్కులు?! | trouble to congress with revanth power comments| three| hours| karnataka| dkshivkumar
posted on Nov 11, 2023 9:56AM
తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుని అధికారం దిశగా రేసుగుర్రంలా దౌడు తీస్తున్న కాంగ్రెస్ కు ఇప్పుడు విద్యుత్ చిక్కులు ఎదురౌతున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట 24 గంటల విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయా అని పరిశీలకులు అనుమానిస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ ఆయన చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ఆయన ఏ సందర్భంగా చేశారో, అసలు వాస్తవంగా ఆయన ఉచిత విద్యుత్ పేర ప్రభుత్వ దోపిడీపై ఆయన విమర్శలు ఏమిటి? అన్నది మరుగున పడిపోయి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ అన్న ఒక్క మాటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నది. రేవంత్ రెడ్డి గతంలో అమెరికాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని చేసిన వ్యాఖ్యకు ముందు, తరువాత ఏం మాట్లాడారన్నది పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్ నేతలు ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
గత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యలు ఉండేవని గుర్తు చేస్తూ, ప్రజలను కాంగ్రెస్ వస్తే నిజంగానే విద్యుత్ కష్టాలు తప్పవని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ పర్యటనలో తాము కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని చేసిన వ్యాఖ్య లు కూడా కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బంది తెచ్చిపెట్టాయి. తాను వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలని తాను అనలేదని రేవంత్ ఎంతగా విడమరిచి చెబుతున్నా.. బీఆర్ఎస్ నేతల విమర్శల ముందు అవి జనానికి పెద్దగా చేరినట్లు కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ అన్నది చాలా తీవ్రమైన అంశమే కాకుండా సున్నితమైన అంశం కూడా. ఇక్కడ వ్యవసాయ పనుల కోసం రైతులు అధికంగా విద్యుత్ పైనే ఆధారపడతారు. ఇదే విద్యుత్ అంశం గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సైతం ఇబ్బందుల పాలు చేసిన విషయం తెలిసిందే.
ఇక పోతే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా విద్యుత్ కు సంబంధించి పలు చర్చలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, అప్పటి కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే.. చీకట్టేనని అప్పట్లో హెచ్చరికలు సైతం చేశారు. అందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారు. అయితే కారణాలు ఏమైతేనేం.. తెలంగాణ ఆవిర్బావం తరువాత తెలంగాణలో విద్యుత్ సమస్యను కేసీఆర్ పరిష్కరించారనే చెప్పాలి. ఆయన హయాంలో రాష్ట్రంలో పెద్దగా విద్యుత్ కోతలు లేవు. వ్యవసాయినికి ఉచిత విద్యుత్ సరఫరా విషయంలోనూ ఆయన విజయం సాధించారనే చెప్పాలి. అయితే 24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ సర్కార్ పాల్పడిన అవినీతిని వివరించే సందర్భంలో రేవంత్ రెడ్డి అన్న ఒక్క మాట.. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది.
రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంటే, ఆ ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టే విషయంలో కాంగ్రెస్ ఒకింత వెనుకబడిందని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మొదలకుని.. ద్వితీయ శ్రేణి నాయకుల వరకూ అంతా మూడు గంటల కరెంట్ వ్యాఖ్యలనే ప్రధానంగా తమ ప్రచారానికి తురఫు ముక్కగా వాడుకుంటున్నారు. ఈ సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ రాష్ట్రంలో ఐదు గంటలు విద్యుత్ అంటూ చెప్పడంతో సమస్య మరింత జఠితమైనట్లైంది. అసలు ఉచిత విద్యుత్ తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తున్నాయన్నది అనుమానంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం రేవంత్ మూడు గంటల విద్యత్ వ్యాఖ్యను నిత్యం చర్చలో ఉండేలా జాగ్రత్త పడుతోంది. కేసీఆర్ చేతికి కాంగ్రెస్ నేతలు విద్యుత్ అనే ఆయుధాన్ని చేజేతులా అందించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడు గంటల విద్యుత్ అన్న రేవంత్ వ్యాఖ్యలు ప్రజలపై ముఖ్యంగా రైతులపై ఏ మాత్రం ప్రభావాన్ని చూపాయన్నది తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందేనంటున్నారు. మొత్తం మీద రేవంత్ వ్యాఖ్యలు ఏదో మేరకు కాంగ్రెస్ కు నష్టం చేశాయన్న అభిప్రాయమే అత్యధికుల్లో వ్యక్తమౌతోంది.