Leading News Portal in Telugu

పోలీసుల సెటిల్మెంట్.. ఏపీ మంత్రికి వాటాలు! | settlement in police station| share| ap| minister| anarchy| peak


posted on Nov 12, 2023 10:12AM

అడ్డగోలు అక్రమాలు, దందాలు, అవినీతి, అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లు మారిపోయింది ఏపీలో వైసీపీ నేతల అరాచకం. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటంటే చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటి లేకపోయినా.. చేసిన అవినీతి, అక్రమాలు, భూదందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, వేధింపుల ఉదంతాలు మాత్రం ఎంతని, ఎన్నని చెప్పినా తరగవన్నట్లు తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. వాళ్లలో వాళ్ళే పొత్తులు కుదరక బయటపడినవి కొన్నైతే  బాధితులు లబోదిబోమంటూ గోడు వెళ్లబోసుకున్నవి మరెన్నో. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టు అయినది అసలు సూత్రధారులా.. కొసరు అనుచరులా అన్నది పక్కన పెడితే ఓ పది పది మందిని అరెస్ట్ చేశారు. ఇక విశాఖలో భూదందాల వ్యవహారం గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏకంగా వైసీపీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగారంటే విశాఖ కేంద్రంగా ఈ రియల్ మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మధ్య చిత్తూరు జిల్లాకి చెందిన మంత్రి కూడా ఇష్టారాజ్యంగా వాటాల దందా నడిపిస్తున్నారన్న ఫోన్ కాల్ రికార్డింగ్స్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పుడు మరో మంత్రి పోలీసులతో సెటిల్మెంట్స్ చేస్తూ వాటాలు వెనకేసుకుంటున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇది ఒక రకంగా మొత్తం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మచ్చగా మారడంతో ఆత్మ రక్షణలో పడిన పెద్దలు పోలీసులపై సస్పెన్స్ వేటు వేసి చేతులు దులిపేసుకున్నట్లు సమాచారం. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో కూర్చుని సబ్ ఇన్స్పెక్టర్ మంత్రితో ఫోన్ లో మాట్లాడి సెటిల్మెంట్ చేసినట్లు బాధితుడు ఒకరు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా చుండూరు ఎస్ఐ భరత్ కుమార్ పై బాధితుడు బత్తుల గోవింద్ ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఎస్ఐ తనను  5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అందులో రెండు లక్షలు మంత్రి మెరుగు నాగార్జునకి ఇవ్వాలని ఎస్ఐ తనకు వివరించినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఎస్ఐ బాధితుడిని ఐదు లక్షలు డిమాండ్ చేసే సమయంలో మంత్రి పేరును ప్రస్తావించడమే కాకుండా తన ముందే మంత్రి మేరుగ నాగార్జునతో మాట్లాడి సెటిల్ చేసినట్లు బాధితుడు వాపోతున్నాడు. 

బాధితుడి మాటలలో చెప్పాలంటే.. బాపట్లకు చెందిన బత్తుల గోవింద్ అనే వ్యక్తి మట్టి తరలించాడన్న ఆరోపణల మీద  చుండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై భరత్ కుమార్ పిలిపించారు. స్టేషన్ లోనే బాధితుడితో బేరసారాలాడిన ఎస్ఐ ముందు బాధితుడి కారుని స్టేషన్ లోనే వదిలిపెట్టి వెళ్ళమని తాను తర్వాత ఈ విషయంపై మాట్లాడతానని కానిస్టేబుళ్లను పురమాయించి ఆ రోజు అక్కడ నుండి వెళ్ళిపోయారట. చేసేదేమీ లేక బాధితుడు కారుని స్టేషన్లో వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత బాధితుడికి ఫోన్ చేసిన ఎస్సై కారు గురించి మాట్లాడాలని స్టేషన్ కు పిలిపించారు. బాధితుడు కారు కోసం స్టేషన్ కి వెళితే మట్టి తరలించిన ఫిర్యాదు మాఫీ చేసి నీ కారు నీకు ఇవ్వాలంటే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. అందులో మంత్రి మేరుగ నాగార్జున గారికి రూ.2 లక్షలు ముట్టజెప్పాలని ఎస్ఐ బాధితుడితో చెప్పారట. అంతేకాదు బాధితుడు అక్కడ ఉండగానే ఎస్ఐ మంత్రి మేరుగ నాగార్జునకి ఫోన్ చేసి మట్టి తరలించిన ఫిర్యాదును రూ.5 లక్షలతో మాఫీ చేస్తున్నట్లు వివరించారట.

 ఆ తర్వాత ఎస్ఐ మంత్రిగారు నీ వద్ద ఐదు లక్షలు తీసుకోమంటున్నారని చెప్పాడట. దీంతో బాధితుడు తాను అంత ఇచ్చుకోలేనని బతిమిలాడితే చివరకు రూ.2 లక్షల 40 వేలకు బేరం తెగ్గొట్టారట. బాధితుడు ఆరోజు రూ.2 లక్షలు ఎంఆర్ఓ, వీఆర్ఓ సమక్షంలోనే ఎస్ఐకి ముట్టజెప్పి కారును తీసుకొచ్చేశాడట. ఇక మిగిలిన 40 వేల కోసం మరోసారి ఫోన్ చేసిన ఎస్ఐ మరో ఐదు వేలు కలిపి 45 వేలు తీసుకు రావాలని చెప్పాడట. దీంతో బాధితుడు రూ.45 వేలు తీసుకొని వెళ్తూ ఏసీబీ వారికి సమాచారం అందిచడంతో ఏసీబీ వాళ్ళు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. ఎస్ఐ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఇలా సెటిల్మెంట్లు చేయడం.. మంత్రికి వాటాలు వెళ్తాయని వివరించడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాలలో సంచలనంగా మారింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటుందా? మరింత ‘లోతుగా’దర్యాప్తునకు ఆదేశింస్తుందా చూడాల్సి ఉంది.