జగన్ పాలనపై పీకే రివర్స్.. ఆ కాస్త అండా పాయె | pk reverse comments on jagan rule| ap| debts| state| crisis
posted on Nov 13, 2023 5:48AM
ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నికల వ్యూహకర్త. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిందంటే అది పీకే చలవేనని అందరికీ తెలిసిందే. పశ్చిమబెంగాల్ లో మమత సర్కార్ మళ్లీ కొలువుదీరిందన్నా, 2014 ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి అడుగుపెట్టిందన్నా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజీలే కారణం. ఇక ఏపీ విషయానికి వస్తే.. గత ఎన్నికలలో వైసీపీ విజయం పీకే వల్లే సాధ్యమైందంటూ జగన్ ఫుల్ క్రెడిట్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో మనల్ని గెలిపిస్తున్నారంటూ గత ఎన్నికలకు ముందు తన పార్టీ క్యాడర్ కు పరిచయం చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ కు సరైన గౌరవం, సముచిత స్థానం కల్పించి ఆయన టీం ఐ ప్యాక్ ఆదేశాలకు అనుగుణంగానే పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అయితే, కొన్నాళ్ళుగా రాజకీయ బాట పట్టిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్నారు. తన టీం పనిచేస్తుంది కానీ తాను ఆ పనికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.పీకే టీం మాత్రం ఏపీలో వైసీపీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది. అయితే, ఐ ప్యాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తున్నా ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇప్పుడు జగన్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవల ఓ డిబేట్లో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ప్రభుత్వాల పనికిమాలిన విధానాలు, రాష్ట్రాలను దివాలా తీసే పథకాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆంధ్రప్రదేశ్ ను ఉదహరించి వైసీపీకి పీకే షాక్ ఇచ్చారు. పంచిపెట్టుకుంటూ పోతే ఏ రాష్ట్రమైనా ఏపీలా అయిపోతుందని.. జగన్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపేలా పీకే కామెంట్స్ చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. దీంతో పీకే ఏంటి జగన్ పాలనపై ఇలా మాట్లాడం ఏంటని రాజకీయ వర్గాలలో చర్చగా మారింది.
ఉన్నట్లుండి పీకే ఇలా ప్లేట్ ఫిరాయించడంపై ప్రధానంగా రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఇప్పుడు వైసీపీకి ప్రతికూల గాలి వీస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఓటమి ఖరారు కావడంతో ఐ ప్యాక్ పనితీరు విషయంలో జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే జగన్ పలుమార్లు ఐ ప్యాక్ తో పాటు పీకేకు హెచ్చరిక సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఐప్యాక్ చేయాల్సిందంతా చేసినా జగన్ తప్పిదాల వలనే ఈ స్థాయి అసంతృప్తికి కారణమని ఐ ప్యాక్ అభిప్రాయం. అదే విషయాన్ని పలుమార్లు ఐ ప్యాక్ హెచ్చరించినా వైసీపీ పెద్దలు పెడచెవిన పెట్టారు. చివరికి పరిస్థితి ఇక్కడకి చేరింది. ముఖ్యంగా ఉచిత పథకాల విషయంలో పీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇలా ఉచిత పథకాలతో రాష్ట్రం దివాళా తీస్తే అధికారంలోకి తెచ్చిన తనను నిందిస్తున్నారని పీకే మధనపడుతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఇలా జగన్ పాలనపై పీకే రివర్స్ అటాక్ ఇచ్చినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఇప్పటికే ఏపీలో వైసీపీపై అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఈ అసంతృప్తిని అంతో ఇంతో మాఫీ చేసే మార్గం చెప్పాల్సిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ పాలనపై అంతకు మించిన అసంతృతప్తితో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే విఫల పాలనకు ఉదాహరణగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉదాహరణగా చూపెడుతున్నారు. వైసీపీ లాంటి పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ప్రజలు తనను తిడుతున్నారని పీకే భావిస్తున్నారు. పీకే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా స్పందించలేదు. ఏపీని జగన్ దివాళా తీయించారన్న తీవ్రమైన వ్యాఖ్యలకు కూడా వైసీపీలో ఎలాంటి కదలిక లేదు. జగన్ విఫల సీఎం అంటూ పీకే తీవ్ర వ్యాఖ్యలు చేసినా వైసీపీలో ఎవరూ స్పందించడం లేదంటే.. ఆయన వ్యాఖ్యలతో పార్టీ నాయకులు కూడా ఏకీభవిస్తున్నట్లే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా జగన్ కు పీకే రూపంలో ఉన్న ఆ కాస్త అండా కూడా పోయిందని అంటున్నారు.