బస్సు యాత్ర కూడా తుస్సు.. వైసీపీ పుట్టి మునగడం ఖాయం! | ycp bus yatra flop| cadre| ignore| leaders| intrest| people| away| jagan| tadepalli
posted on Nov 14, 2023 12:46PM
ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అధికార పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా సూపర్ సక్సెస్ కావాలి. ఎందుకంటే మందీ మార్బలం, అధికారం యంత్రాంగం అన్నీ చేతిలోనే ఉంటాయి కనుక ఏదో ఒక మార్గంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు. కానీ, వైసీపీ అన్నీ ఉన్నా తన కార్యక్రమాలను సక్సెస్ చేసుకోలేకపోతున్నది. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది అన్నది సుస్పష్టం. ఆ అసంతృప్తి, ఆ ప్రజాగ్రహమే ఇప్పుడు వైసీపీ కార్యక్రమాలపై ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే వైసీపీ పలు కార్యక్రమాలు తలపెట్టగా ఒక్కటీ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వైసీపీ రెండు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అందులో ఒకటి సామాజిక బస్సు యాత్ర కాగా, మరొకటి ఏపీకి మళ్ళీ జగనే ఎందుకు కావాలి. రెండో కార్యక్రమం పూర్తిగా రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించి, ఆ పని వారికి అప్పగించింది. బస్సు యాత్ర మాత్రం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ అందరూ పాల్గొనాలని జగన్ ఆదేశించారు. కానీ, బస్సు యాత్రకు కార్యకర్తలు కూడా మొహం చాటేస్తున్నారు. ఎక్కడిక్కడ నలుగురు నేతలతో ఈ కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. అనిపిస్తున్నారనే కంటే జనం, పార్టీ క్యాడర్, నాయకులు కూడా మోహం చాటేస్తుండటంతో మమ అనిపించడం తప్ప పార్టీ నేతలకు మరో మార్గం, గత్యంతరం లేని పరిస్థితి అని చెప్పడమే కరెక్ట్ అని పరిశీలకులు అంటున్నారు.
ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైసీపీ పెద్దలకు కూడా తెలుసు. కానీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ప్రజలకు ఇంత చేశాం చేశాం.. అంత చేశాం.. ఇన్ని సొమ్ములు పందేరం చేశాం.. ఇక మాకు తమకు తిరుగే ఉండదని చెప్పుకుంటున్నారు. అయితే పార్టీ పరంగా చేపడుతున్న ఏ కార్యక్రమమూ సక్సెస్ కావడం లేదు. సక్సెస్ సంగతి పక్కన పెడితే అట్టర్ ప్లాప్ అవుతోంది. గడపగడపకూ కార్యక్రమమే ఇప్పటి వరకూ అందుకు ఉదాహరణగా ఉండగా, ఇప్పుడు కీలక నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పటికే పలు అంతర్గత సర్వేలు పార్టీ హై కమాండ్ ను కలవర పెడుతున్నాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు కూడా వైసీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు పూర్తిగా జగన్ కక్షసాధింపుగానే ప్రజలు చూస్తున్నారు. వరసపెట్టి ఆరు కేసులు నమోదు చేయడం కూడా దురుద్దేశపూర్వకమేనని ప్రజలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. దీంతో అసలే తగ్గిన ప్రభుత్వ గ్రాఫ్ ను చంద్రబాబు అరెస్ట్ మరింత దిగజార్చి పూర్తిగా అదఃపాతాళానికి పడిపోయేలా చేసింది.
నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ ప్రజా అవసరాలను గాలికి వదిలేసి రాజకీయ అంశాలకే ప్రాధాన్యమిచ్చారన్న టాక్ ఉంది. దీనిని నిజం చేస్తున్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసేవారు. చంద్రబాబు విషయంలో కూడా వైసీపీ నేతలు అదే అత్యుత్సాహం ప్రదర్శించారు. వరసబెట్టి అందరూ చంద్రబాబు దోషి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. అయితే జనం వారి మాటలను పట్టించుకోలేదు. జగన్ రాజకీయ కక్షసాధింపు అని నిర్ణయానికి వచ్చేశారు. ఫలితంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి పూర్తిగా చతికిలా పడిపోయింది. పోనీ పార్టీ అధినేత జగన్ అయినా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారా ? అంటే అదీ లేదు. తాను తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా పరదాల చాటునే ఉంటున్నారు. చివరాఖరికి సొంత నియోజకవర్గంలో కూడా జనం నిరసనల కారణంగా మొహంచాటేసిన పరిస్థితి ఇటీవల పులివెందులలో ఎదురైంది. దీంతో ఆయన తన పని బటన్లు నొక్కడం మాత్రమేననీ, మిగిలినదంతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులే చూసుకోవాలని చెప్పేసి చేతులెత్తేశారు. మీరే నా నమ్మకం.. మీరే నా సైన్యం.. మీ దీవెనలే నా ఆశీస్సులు అంటూ ఎమోషనల్ టచ్ తో ప్రసంగాలు చేస్తూ, నాయకులు, క్యాడర్ ను ప్రజలలోకి వెళ్లాలని ఆదేశా లిస్తున్నారు.
ఇదే ట్రెండ్ కొనసాగితే పుట్టి మునగడం ఖాయమని మంత్రులు సైతం అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఛాన్స్ దొరికితే గోడ దూకేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. జగన్ ను బయటకు వచ్చి ఏదైనా చేయాలని కోరే స్థాయి ఎవరికీ లేదు. ఒకవేళ కోరినా ఆయన వచ్చే పరిస్థితీ లేదు. వచ్చినా ఆయన ప్రసంగాల పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. అందుకే జగన్ వచ్చినా పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదన్న నిర్ణయానికి పార్టీ క్యాడర్ దాదాపుగా వచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇలా బస్సు యాత్రల పేరిట తమను పంపించి ఇంకా పలచన చేస్తున్నారన్న భావన వైసీపీ నేతలలో బలంగా వ్యక్తమౌతోందని అంటున్నారు. మొత్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బస్సు యాత్ర తుస్సు మనడంతో ఈ సారి ఎన్నికలలో వైసీపీ పుట్టిమునగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.