posted on Nov 15, 2023 1:52PM
పాలకొల్లులో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. టిడ్కో ఇళ్ల వద్ద వంటా వార్పు, పాలకొల్లును చూడు పేరుతో నిరసనకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయితే బుధవారం ఎమ్మెల్యే రామానాయుడిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.. రామానాయుడు ఇంటి దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. ఎమ్మెల్యే బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు.అధికార ప్రతిపక్ష నేతల నిరసనల ప్రదర్శనలతో పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది.. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు. బుధవారం పాలకొల్లు చూడు పేరుతో ఎమ్మెల్యే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. దీనికి పోటీగా వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంజార్జ్ గొడాల గోపి కూడా నిజం చెబుతాం పేరుతో కార్యక్రమం చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.. పెంకిళ్లపాడు వెళ్లే క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు ఎమ్మెల్యే చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి ఎమ్మెల్యే కింద పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయనను భీమవరం వైపు తీసుకెళ్లారని టీడీపీ కార్యకర్తలు తెలిపారు.రామానాయుడు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడికి వచ్చిన టీడీపీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిమ్మల రామానాయుడు టిడ్కో ఇళ్ల దగ్గరకు వెళతారని ఊహించి ముందుగానే అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయకుండా టీడీపీ, జనసేన శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదా, తోపులాట జరిగింది. టీడీపీకి మద్దతుగా జనసేన నాయకులు నిలిచారు. వైఎస్సార్సీపీ ఆందోళనకు అనుమతి ఇచ్చి, తమకు అనుమతి ఇవ్వలేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.