రెగ్యులర్ బెయిలా.. క్వాష్ పిటిషన్ తీర్పా.. ఏం జరుగుతుంది? ఏందుకీ జాప్యం?? | skill case what happening| babu| bail| petition| quash| adjourn| verdict
posted on Nov 16, 2023 11:15AM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో ఉంచిన స్కిల్ కేసు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పై ఉండగా.. ఈ బెయిల్ గడువులోగా ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ వస్తుందా? సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు ఎప్పుడు వస్తుంది? క్వాష్ పిటిషన్ లో ఊరట లభిస్తుందా లేదా? ఇలా స్కిల్ కేసుపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. స్కిల్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. అక్టోబర్ నెలలోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయగా ఈ నెల మొదటి వారంలోనే తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ, దీపావళి సెలవుల తర్వాతకు తీర్పు వాయిదా పడింది. ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ తీర్పు కీలకం కానుంది.
ఇక ఇదే కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉండగా పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్ ఈ బుధవారం (నవంబర్ 15) హైకోర్టులో విచారణ చేయాల్సి ఉంది. కానీ, ఆ రోజు విచారణ వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబు నేరం చేశారనే దానిపై వివరాలు ఇవ్వాలని, సీఐడీ ఆరోపించినట్లుగా టీడీపీ ఖాతాలోకి 27 కోట్లు వచ్చాయనే వివరాలు ఇవ్వాలని కోర్టు సీఐడీని కోరింది. అయితే ఏపీ సీఐడీ ఇన్నాళ్లు మౌనంగా ఉండి సరిగ్గా బుధవారం విచారణ అనగా మంగళవారం( నవంబర్ 14) స్కిల్ ప్రాజెక్టు వివరాలు కావాలని టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం తరఫు న్యాయవాదులు.. వాయిదాలపై వాయిదాలు కోరుతూ బెయిలుపై కోర్టు నిర్ణయం జాప్యం అయ్యేలా వ్యవహరిస్తున్నారని సర్వులకూ అర్ధమైంది. అందుకు అనుగుణంగానే బుధవారం(నవంబర్ 15) హైకోర్టు విచారణలో ఏదీ తేలక గురువారానికి (నవంబర్ 16)వాయిదా వేశారు. ఆ రోజు కూడా బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి చేస్తారా అన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. గత విచారణలో అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని.. సీఐడీ ఏకంగా 22వ తేదీకి వాయిదా కోరారు. కానీ, కోర్టు కుదరదంటూ 15వ తేదీకి వాయిదా వేసింది. కానీ, ఇప్పుడు 14వ తేదీన వివరాలు కావాలని టీడీపీకి నోటీసులు ఇవ్వగానే మరోసారి వాయిదాకేనని అర్ధమైపోయింది. ప్రస్తుతానికి అయితే ఈనెల చివరి వరకూ చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కొనసాగనుంది. ఆ లోపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు, హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ పూర్తవుతుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే అసలు రిజర్వ్ లో ఉన్న తీర్పు ఎందుకు ఆలస్యమవుతున్నది? హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా విచారణ ఎందుకు ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది అన్న చర్చలు కూడా సహజంగానే జరిగిపోతున్నాయి.
నిజానికి ఈ కేసు ఇటు సీఐడీ కోర్టు నుండి అటు సుప్రీంకోర్టు వరకూ ఎప్పుడో విచారణ పూర్తి అయ్యేది. కానీ, సీఐడీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసును వాయిదాల మీద వాయిదాలు పడేలా చేస్తూ కేసును కొనసాగేలా చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నేరం నిరూపించే స్థాయిలో ప్రభుత్వం వద్ద ఆధారాలు లేకపోవడం, సీఐడీ బనాయించిన కేసులకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతోనే న్యాయస్థానాలలో ఈ కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా, దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నదని న్యాయ నిపుణులు అంటున్నారు. సీఐడీ తమ వద్ద ఆధారాలు లేకపోయినా ప్రభుత్వ న్యాయవాదులతో వాయిదాలు కోరేలా చేస్తూ ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ నెలలోనే ఈ కేసులో తీర్పు రావాల్సిన అవసరం ఉండగా సీఐడీ, ప్రభుత్వ తరపు న్యాయవాదులు అందుకు ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తారన్నఅనుమానాలూ, సందేహాలూ సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.