Leading News Portal in Telugu

నీకో దణ్ణం.. నీ పార్టీకో దణ్ణం..తానేటి వనితకు నిరసన సెగ | taneti vanita faces protest in own constituency| kovvuru| people| stop| home


posted on Nov 17, 2023 3:16PM

ఏపీ హోం మంత్రి తానేటి వనితను ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రిని గంటన్నర పాటు నడిరోడ్డుపైనే నిలబెట్టి వెనుదిరిగి వెళ్లిపొమ్మన్నారు. హోంమంత్రి కదా.. భారీ సంఖ్యలో పోలీసులను రప్పించుకుని  లైన్ క్లియర్ చేయించుకున్నారు. దీంతో  ఆమె తీరు పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మా ఊరికి వచ్చి మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ ప్రజలు తిరగబడ్డారు. చివరికి వైసీపీ మండల స్థాయి నేతలు, గ్రామ నేతలు ప్రజలకు నచ్చజెప్పడంతో మంత్రి వనిత బాధితుడిని పరామర్శించి సాయం చెక్కును అందించి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇచ్చి అక్కడ నుండి వెనుదిరిగారు. బాధితుడి చావుకు ప్రభుత్వం, పోలీసులే కావడం, స్వయంగా హోంమంత్రి అలసత్వం కారణంగానే బాధితుడు మరణించడంతో సొంత పార్టీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం పెల్లుబికింది. ప్రజలైతే ఏకంగా మంత్రిపై తిరగబడ్డారు. మీ పరామర్శ మాకు అవసరం లేదంటూ గో బ్యాక్ నినాదాలిచ్చారు. మనుషుల్ని చంపేసి ఓదార్పు యాత్రకు వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీరూ వద్దు.. మీ ప్రభుత్వం వద్దు.. మీకో నమస్కారం.. మీ పార్టీకో నమస్కారం అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఈ నెల ఆరున  కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నిర్వహించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఒక దానిలో స్థానిక నాయకుల ఫోటోల్ని చించేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మహేందర్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేసి పోలీసులు హింసించారు. మహేందర్ వైసీపీ కార్యకర్త అవ్వడమే కాకుండా హోంమంత్రి తానేటి వనిత కోసం కూడా  పనిచేశాడు. కానీ, ఫ్లెక్సీల గొడవ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అతన్ని చితకబాదారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సమయంలోనే మహేందర్ తానేటి వనితకు ఫోన్ చేయగా.. నిన్నేం చేయరు పంపించేస్తార్లే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. చిత్రహింసల అనంతరం పోలీసులు అతడ్ని విడిచి పెట్టారు. స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన మహేందర్ అవమానభారంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ఇది ఒకరకంగా పోలీసుల హత్యే,  ముఖ్యంగా హోంమంత్రి విజయం కోసం పనిచేసి, హోంమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేసిన దళిత సామజిక వర్గానికి చెందిన కార్యకర్తను పోలీసులే చిత్రహింసలు పెట్టి చంపేశారు. తనకు సాయం చేయాలని కోరుతూ మంత్రికి ఫోన్ చేసినా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం పోయింది.  దీనిని స్థానిక ప్రజలు, వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. స్థానికంగా పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు ఫ్లెక్సీల వివాదానికి దారితీయడం..  పోలీసులు అత్యుత్సాహంతో ఓ కార్యకర్త కన్నుమూశాడు. హోంమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఈ విషయం రాష్ట్రస్థాయిలో  సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి పరిహారం చెక్కులు అందించేందుకు మంత్రి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలు మంత్రిని రానివ్వకుండా అడ్డుకోవడంతో మంత్రి రోడ్డుపైనే గంటన్నర వేచిచూడాల్సి వచ్చింది. 

మంత్రి ఏది ఏమైనా పరామర్శించే వెళ్తానని భీష్మించుకోవడంతో స్థానిక ప్రజలు మంత్రిని చుట్టుముట్టి ముందుకు కదలనీయకుండా చేశారు. అదే సమయంలో స్థానిక తెలుగుదేశం దళిత నేతలతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను  హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగడం, స్థానిక వైసీపీ నేతలు కల్పించుకొని బాధిత కుటుంబాన్ని ఒప్పించి మంత్రిని కలిసేలా చేశారు. దీంతో తాను తీసుకొచ్చిన పరిహారం చెక్కు  బాధితుడి కుటుంబానికి అందజేసి.. వారి ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న హామీ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో ఈ వ్యవహారం ఉభయగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దళిత యువకుడిని పోలీసులే హింసపెట్టి చంపడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా.. ప్రశ్నిస్తున్న వారిని ఎక్కడిక్కడ నిర్బంధించడం వివాదాస్పదమౌతోంది.