posted on Nov 20, 2023 10:28AM
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లు సుమారు 50 బోట్లు వరకు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం అందుతోంది. అగ్ని మాపక సిబ్బంది అతి కష్టంతో 10 బోట్లు వరకు కాపాడగలిగారు.ఒక బోటు ఖరీదు అంచనాగా 30 నుండి 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ విధంగా సుమారు 40 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఇంతటి ఘోర విషాదం ఎలా జరిగింది అన్న విషయం పై దర్యాప్తు చేయవలసి ఉంది, వేటకు వెళ్ళాల్సిన దినసరి కూలీలు, వీటిపై బ్రతికే వారందరి పరిస్థితి అరణ్య రోదనగా మారింది. బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరిని కదిలించినా హృదయ విదారకంగానే ఉంది. ఈ బోట్లలో భారీగా చమురు, పెట్రోలు, ఇతరత్రా మండే స్వభావం ఉన్న వాటిని ఉంచడంతో.. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఐతే.. బోట్లలో ఎవరైనా ఉన్నారా, వారికి గాయాలేమైనా అయ్యాయా అన్నది తెలియాల్సి ఉంది.ఒక్కో బోటులో సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం వెనక ఓ యూట్యూబర్ ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పల రాజుకు సూచించారు.