బీజేపీలో కేసీఆర్ నాటిన ఆ కలుపు మొక్క ఎవరు? | vijayashanti says kcr planted covert in bjp| ramulamma| lady| amitabh| congress
posted on Nov 21, 2023 9:16AM
బీజేపీకి రాంరాం చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ రాములమ్మ.. పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఆమె బీజేపీని వీడితే వీడారు కానీ, అలా వీడిన వెంటనే కారు, కమలం పార్టీలు దొందూదొందేనని బాంబు పేల్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీలో ఓ కలుపుమొక్కను నాటారంటూ ఓ బాంబు పేల్చారు. ఆ కలుపు మొక్కే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్రస్తుత దుస్థితికి కారణమని కుండబద్దలు కొట్టారు. అయితే విజయశాంతి చెబుతున్న ఆ కలుపు మొక్క ఎవరన్న దానిపై ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
విజయశాంతి మాటల సారాంశం ఏమిటంటే.. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా, పకడ్బందీ ప్రణాణికతో బీజేపీలోకి ఒక కోవర్ట్ ను పంపారని. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బీజేపీలోకి పంపిన ఆ కోవర్ట్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది. విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత తొలి సారిగా గాంధీ భవన్ కు మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా సమావేశంలోనే విజయశాంతి కేసీఆర్.. బీజేపీలో తన కోవర్ట్ ను కలుపుమొక్కలా ప్రవేశపెట్టారని ఆ మనిషి.. ఎక్కడ ఏం గందరగోళాలు సృష్టించాడో ఏమో కానీ.. పార్టీలో గొడవలు సృష్టించి.. అధ్యక్షులను దింపాలి దింపాలంటూ.. హైకమాండ్‌కు పదే పదే చెప్పడం.. అందుకోసం పలుమార్లు ఢిల్లీకి వెళ్లడంతో.. ఆయన మాటలకు కట్టుబడి బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జరిగిందంటూ ఆమె వివరించారు. అంతే కాకుండా.. ఆ మనిషి ఆసైన్డ్ భూములు ఏమైనాయి.. ఆ మనిషి మీద ఉన్న కేసులు ఏమైనాయి.. అన్నది అంతా ఆలోచించాలంటూ ఈ సందర్బంగా రాములమ్మ పేర్కొన్నారు.
అదీకాక.. తెలంగాణలో జరిగిన వరుస ఉప ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపొందితే.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపొందారు. ఇక నాగార్జున సాగర్, మునుగోడులలో.. కారు పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం విదితమే.
అలాంటి వేళ అంటే కేసీఆర్ నాటిన మొక్క.. ఈటల రాజేందరా? లేకుంటే రఘునందన్ రావా? అనే సందేహం సైతం పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ ఇద్దరూ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. బీజేపీలో చేరిన వారే. ఆ క్రమంలో తొలుత రఘునంధన్ బయటకు వచ్చాడు .. ఆ తర్వాత ఈటల వచ్చారు. కానీ రాములమ్మ చెప్పినట్లు అసైన్డ్ భూముల వ్యవహారం. కేసులు అంటే.. వెంటనే ఈటల రాజేందర్ గుర్తుకు వస్తారు. దీంతో రాములమ్మ చెప్పిన, చెబుతున్న కలుపు మొక్క ఈటలేనా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి.
అందుకే.. గతంలో ఉప్పు నిప్పులా ఉన్న గులాబీ, కమలం పార్టీలు.. ప్రస్తుత ఎన్నికల వేళ… భాయి.. భాయి అన్న చందంగా వ్యవహరిస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవడం.. ఆ తర్వాత చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో అటు గులాబీ పార్టీకి.. ఇటు కమలం పార్టీకి మధ్య అనుసంధాన కర్తగా ఈటల వ్యవహరించారా? అందుకే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హేమా హేమీలు అరెస్ట్ అయి.. తీహార్ జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. కవితకు మాత్రం అరెస్టు మినహాయింపు లభించిందా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చ వద్దంటూ.. తాను పదే పదే కమలం పార్టీ అధిష్టానానికి చెప్పినా.. కేసీఆర్ నాటిన మొక్క చెప్పడం వల్లే ఆ పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారు నియమితులరంటూ రాములమ్మ చెప్పడాన్ని బట్టి చూస్తే.. కేసీఆర్ బీజేపీలో ప్రవేశపెట్టిన కోవర్ట్.. ఈటలే అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోందని పరిశీలకులు సైతం అంటున్నారు. అదీకాక గత రెండేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు బయట కుస్తీ లోన దోస్తీ అన్న చందంగా వ్యవహరిసున్నాయనే ఓ చర్చ సైతం నడుస్తోంది. అంటే కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య రాజకీయ వైరం లేదా? కే వలం వీళ్లు ఆడుతోన్న ఓ డ్రామానేనా అనే ఓ సందేహం సైతం తెలంగాణ సమాజంలో వ్యక్తమౌతోంది.