Leading News Portal in Telugu

వైసీపీలో మరో ఆర్ఆర్ఆర్ బాలినేని!? | another rrr in ycp| balineni| party| trouble| comments| jagan| tenure| land


posted on Nov 21, 2023 1:15PM

ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలో మరో రెబల్ నేత తయారయ్యారు.  ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రెబల్ గా మారి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కంట్లో కనుసులా మారి ప్రభుత్వ వైఖరిని, తప్పిదాలను ఎండగడుతున్న సంగతి తెలిసిందే.  సొంత పార్టీయే అయినా రెబల్ గా మారిన రఘురామపై ఏపీ పోలీసులు పలు కేసులు పెట్టి అరెస్టులు చేసి వేధించారు. లాకప్ లో మ్యాన్ హ్యాండిల్ చేశారు. అయినా సరే తగ్గేదేలే అన్నట్లుగా రఘురామకృష్ణం రాజు జగన్ సర్కార్ పై తన అటాక్ ను మాత్రం ఆపలేదు. ఇంతలా ఆర్ఆర్ఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా.. ఆయన ఇప్పటికీ  వైసీపీలోనే ఉన్నారు. రాజీనామా చేయలేదు. అలాగే  వైసీపీ కూడా ఆయనను బహిష్కరించలేదు.  ఇప్పుడు అధికార పార్టీకి పార్టీలోనే మరో రఘురామకృష్ణం రాజు బయలుదేరారు. ఆయన ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అన్నిటికీ మించి సీఎం జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని కూడా ఛాన్స్ దొరికితే చాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలు ఈయన్ని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించినా, మందలించినా ఆయన కూడా వెనక్కు తగ్గేదేలే అంటూ   ప్రభుత్వం బండారాన్ని బయటపెట్టేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేసిన  బాలినేని తాజాగా ఏపీ అంతటా భూకబ్జాలు జరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఒంగోలు కేంద్రంగా జరిగిన భూకబ్జాలపై చాలా కాలంగా ఫైట్ చేస్తున్న బాలినేని తాజాగా ఇదే విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోనూ భూవివాదాలు.. భూకబ్జాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ అంతటా భూకబ్జాలు, ఆక్రమణలు జరిగినా ఎక్కడా విచారణ జరగలేదని.. ఏ జిల్లాలో కూడా ప్రజాప్రతినిధులు విచారణ కోరిన దాఖలాలు లేవని, కానీ రాష్ట్రంలో తాను ఒక్కడినే ఈ విషయంపై విచారణ కోరి పోరాటం చేస్తున్నానని అన్నారు. భూ ఆక్రమణలు తన వరకు వచ్చిన వెంటనే స్పందించి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి సిట్ వేయించానని.. నిందితులు ఎవరైనా సరే వదలొద్దని సిట్ అధికారులకు ఫుల్ పవర్ ఇచ్చానని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాననీ చెప్పారు. తాను సిట్ వేయించిన తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చి ఫిర్యాదులు చేయటం మొదలు పెట్టినట్లుగా  కూడా చెప్పారు. తన చొరవతో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో భూస్కాంలో ప్రమేయం ఉన్న వారిలో దాదాపు 200 మంది ఊరొదిలి పారిపోయారని, ఇదే తరహాలో భవిష్యత్ లో భూకబ్జాలు, అక్రమణలంటే భయపడేలా చేస్తానని ప్రకటించారు.

ప్రకాశం జిల్లాలో భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై చాలా కాలంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆక్రమణల వ్యవహారంలో సీఎం జగన్ బాబాయి,  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లు ఫిర్యాదులు అం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  బాలినేని తిరుగుబాటుతో పోలీసులు పది మందిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే, అసలు నిందితులు వేరే ఉన్నారన్నది బాలినేని వాదన. చాలా కాలంగా ఇదే విషయంపై అధిష్టానం బాలినేనిని బుజ్జగించినా ఆయన మాత్రం మీడియా ముందుకు రావడం, బహిరంగంగానే తమ ప్రభుత్వంలో తమ పార్టీ నేతలే భూకబ్జాలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని మాట్లాడుతుండడం వైసీపీకి, మరీ ముఖ్యంగా జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారూ, ఆరోపణలు చేస్తున్న వారూ కూడా ఆయనకు బంధువులే.  నిన్న మొన్నటి వరకూ ప్రకాశం జిల్లాకి పరిమితమైన బాలినేని, ఇప్పుడు జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు జరుగుతున్నాయనీ, తనలాగే ప్రజా ప్రతినిథులందరూ ఫిర్యాదులు చేసి కబ్జాలను అడ్డుకోవాలన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.   ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా భూకబ్జాలు, ఆక్రమణలు ఉన్నాయని చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా జగన్ ను, ఆయన సర్కార్ ను ఇబ్బందులలోకి నెట్టేశాయి.  

వైసీపీలో బాలినేని వైరాగ్యం ఈనాటిది కాదు. రెండేళ్ల కిందట తనకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికినప్పటి నుంచే ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే, అప్పుడు జిల్లా మీద పెత్తనం అన్న హామీతో సర్దుకున్నారు. అయితే ఎప్పుడైతే జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి హవా మొదలైందో అప్పటి నుంచే  బాలినేని  రెబల్ గా మారిపోయారు. బాలినేని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా వైసీపీ  బుజ్జగించడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. ఈ సారి బాలినేనికి సీటు ఇవ్వరని, సుబ్బారెడ్డి పోటీకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది.   సుబ్బారెడ్డి కూడా ఇప్పటికే తాను ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.  అలాగే బాలినేని  వైసీపీని వీడి సైకిల్ ఎక్కే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అది ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇటు బాలినేని పార్టీని వీడడం లేదు.. అటు పార్టీ కూడా ఆయనను పంపించేయడం లేదు.  అయితే బాలినేని  వ్యాఖ్యలు మాత్రం వైసీపీకి తీరని డ్యామేజీ తెచ్చిపెడుతున్నాయనడంలో సందేహం లేదు. పరిశీలకులు కూడా బాలినేని వైసీపీలో పూర్తి స్థాయి రెబల్ గా మారిపోయినట్లుగానే కనిపిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.