Leading News Portal in Telugu

ఇదేమిటి రామచంద్ర ప్రభు..! | ramachandra yadav complaint on jagan in pulivendula| police| station| netizens| troll| assets| cases| purandeswari| amitshah| nirmala| sitaraman


posted on Nov 22, 2023 5:41AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి నేటి వరకు లక్ష అరవై వేల కోట్ల రూపాయిల అవినీతి చేశారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పులివెందుల ఎస్సైని ఆయన కోరారు. అనంతరం పులివెందుల పోలీస్ స్టేషన్ బయట ముఖ్యమంత్రి   జగన్‌పై రామచంద్రయాదవ్ పలు ఆరోపణలు సంధించారు. అయితే సీఎం జగన్‌ అవినీతిపై రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

సీఎం వైయస్ జగన్‌ అవినీతిపై రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేయడంపై నెటిజన్లు ఫక్కున నవ్వుతున్నారు. ఇప్పటికే  జగన్‌పై అక్రమ ఆస్తుల కేసులు చాలానే ఉన్నాయని..  అందులోభాగంగానే ఆయన 16 నెలల పాటు చంచల్ గూడ జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చి.. ముఖ్యమంత్రి అయ్యారని వారు గుర్తు చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, జే బ్రాండ్ మద్యం విక్రయాలు, డ్రగ్స్ దందా, గంజాయి అక్రమ రవాణా వగైరా వగైరా ఆరోపణలు   జగన్ ప్రభుత్వంపై ఉన్నాయని.. మరి ఇన్నాళ్లూ ఊరుకొని.. జస్ట్ ఎన్నికలకు ముందు ఇలా సీఎంగారి అవినీతి బాగోతంపై.. అదీ కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలని రామచంద్రయాదవ్‌ను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  

ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంచాయతీ నిధుల దారి మళ్లింపు, లెక్కకు మించి చేస్తున్న అప్పులపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి స్వయంగా ఫిర్యాదు చేశారని..  అలాగే హద్దు అనేదే లేకుండా జగన్ ప్రభుత్వం అప్పుల చేస్తుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆమె స్వయంగా లేఖ సైతం రాశారని.. అదే విధంగా జే బ్రాండ్ మద్యం తాగి ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రాష్ట్రంలో అధికమవుతోందని.. ఇక మద్యం తాగి మరణిస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే ఉంటుందని.. ఆమె ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. ఢిల్లీ వెళ్లి సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో చోటు చేసుకొన్ని ప్రతి అంశాన్ని   ప్రస్తావిస్తూ.. ఓ లేఖను కూడా అందజేశారని.. కానీ ఆ రోజు నుంచి.. ఈ రోజుకు జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకున్న దాఖలాలు  లేవని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. 

అలాంటి వేళ… రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేస్తే.. అదీకూడా సీఎం  జగన్ సొంత ఇలాకా పులివెందులకు వెళ్లి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడమేమిటని నెటిజన్లు  సందేహం  వ్యక్తం చేస్తున్నారు. అయినా.. ఈ రామచంద్రయాదవ్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు చెందిన వారని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. సీఎం జగన్ రైట్ హ్యాండ్ వైసీపీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా వాసి అని వారు వివరిస్తున్నారు.

అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఈ రామచంద్ర యాదవ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని వారు అంటున్నారు. అవి కూడా ఎంతగా అంటే.. అపాయింట్‌మెంట్ లేకుండా.. అమిత్ షాను నేరుగా కలిసేటంత  అంటున్నారు.  అలాంటిది జగన్ అవినీతిపై రామచంద్రరావు ఏపీ పోలీసులకు అందునా పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని అంటున్నారు. అంత కంటే రామచంద్రయాదవ్ నేరుగా   అమిత్ షాకు ఫిర్యాదు చేస్తే ఫలితముండేదేమోనని నెటిజన్లు సూచిస్తున్నారు. అదీకాక జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై ఓ వైపు అక్రమ కేసుల నమోదు,  మరోవైపు ఆయా పార్టీ శ్రేణులపై వరుస దాడులు జరుగుతున్నాయని.. అందుకు అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు ఏ జిల్లా.. ఏ ప్రాంతం మినహాయింపు కాదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటిది.. సీఎం  జగన్ అవినీతిపై ఫిర్యాదు చేయడం చూస్తుంటే… ఇది పక్కా ఎన్నికల స్టంట్ అని వారు అభిప్రాయపడుతున్నారు. 

అయినా.. వైయస్ జగన్ 16 నెలలు శ్రీకృష్ణుడి జన్మస్థానంలో ఉండి..  ఏడు ఊచలు పదే పదే లెక్కించాడని తెలిసి కూడా ఆయన వద్ద ఉన్న లక్ష కోట్ల రూపాయిల్లో ఎంతో కొంత తమకు ఇచ్చేస్తాడనుకొని.. ఆయన పార్టీకి 151 ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ వాసులదని.. అలాంటి  జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రంలోని పెద్దలకే ఫిర్యాదు చేసినా లేఖల ద్వారా వివరించానా.. వారి నుంచి కనీస స్పందన కూడా లేదని.. అలాంటిది మీరు పులివెందుల వెళ్లి.. జగన్ అవినీతిపై ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఓ వేళ వారు కేసు నమోదు చేసినా? జగన్ బాబు అవినీతిపై పోలీసులు దర్యాప్తు చేస్తారా? అంటే.. ఈ విషయం అంత నమశక్యంగా లేదని.. ఎందుకంటే.. ఇది ప్రజాస్వామ్య దేశమని..  అదీకూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని.. అలాంటి దేశంలో చోరులు, బడా చోరులు, దొరలు, స్కామ్‌ల్లో నిండా మునిగి తేలుతున్న వారు, బాబాలు, స్వామిజీలు, సన్యాసులు వగైరా వగైరా ఎవరైనా అవినీతి చేయవచ్చు, అలాగే అందలం ఎక్కవచ్చని.. కానీ వారు తప్పు చేశారు… అవినీతి చేశారని ఫిర్యాదు చేస్తే మాత్రం.. మన దేశంలోని దాదాపుగా అన్ని వ్యవస్థలకు ఆటోమెటిక్‌గా పక్షవాతం వచ్చేస్తుందని,  అదే పేదలు, నిరుపేదలు, మద్య తరగతి జీవులు .. రూపాయో, పది రూపాయిలో దొంగతనం చేస్తే మాత్రం .. వారిని శిక్షించేందుకు దాదాపుగా అన్ని వ్యవస్థలు పానకం తాగి పూనకం వచ్చినట్లుగా.. ఇంకా చెప్పాలంటే.. ఆయా వ్యవస్థలకు ప్రతినిధులుగా, జవాబుదారీతనానికి అసలు సిసలు నిర్వచనంలాగా నిండు చలాకీతనంతో వ్యవహరిస్తారని నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు.