Leading News Portal in Telugu

అమెరికాను హడలెత్తిస్తున్న లిస్టీరియా.. పండ్ల ద్వారా వ్యాప్తి! | listeria out break in america| spread| friuts| deadly


posted on Nov 23, 2023 5:19AM

కరోనాఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. దీనిలోనే ఎన్నో వేరియంట్లు కూడా పుట్టుకొచ్చి ప్రపంచాన్ని హడలెత్తించిన సంగతి తెలిసిందే. మొత్తంగా కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను హరించింది. ముఖ్యంగా చైనా, యూఎస్, అమెరికా లాంటి   దేశాలలో ఈ ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. కరోనా మహమ్మరి బారి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కానీ, అంతలోనే రకరకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు   పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు కొత్త వైరస్ లు, బ్యాక్టీరియాలపై  హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.  ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు ఓ కొత్త వైరస్   హడలెత్తిస్తోంది. ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్లలో జీవించే ఈ వైరస్ పండ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

 సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఒక ఘోరమైన లిస్టిరియా అమెరికా దేశంలో వ్యాప్తి చెందుతున్నట్లు హెచ్చరించారు. ఈ లిస్టిరియా అమెరికాలోని పలు ప్రాంతాలలో గల పంట పొలాలలో ఉత్పత్తై.. అక్కడ నుండి పండ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా పీచెస్, ప్లమ్స్ వంటి పండ్ల రకాలతో ఈ లిస్టిరియా వ్యాప్తి చెందుతుందట. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుకాణాలలో కొన్ని కంపెనీ పండ్లను తిన్న తర్వాత ఒకరు మరణించగా మరో 10 మందిఅస్పత్రి పాలయ్యారు. 10 మందిలో ఒక  గర్భిణీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2022లో మే 1 నుండి నవంబర్ 15 వరకు, ఆ తర్వాత ఈ ఏడాది కూడా ఎవరైతే ఆ కంపెనీ పండ్లను కొనుగోలు చేశారో వారు వెంటనే వాటిని విసిరివేసిన, నిల్వ చేసిన  ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ సహా ఆప్రాంతాలన్నిటినీ  శుభ్రం చేయాలని సూచించినట్లు సీడీసీ తెలిపింది.

 ఎల్లో పీచ్ 4044, 4038, వైట్ పీచ్ 4401, ఎల్లో నెక్టరైన్ 4036, 4378, తెలుపు నెక్టరైన్ 3035, రెడ్ ప్లమ్ 4042, బ్లాక్ ప్లమ్ 4040 పండ్ల ద్వారా లిస్టిరియా వ్యాప్తి చెందినట్లు గుర్థించారు లిస్టిరియా బాధితులు ఇప్పటి వరకు కాలిఫోర్నియా, కొలరాడో, కాన్సాస్, ఇల్లినాయిస్, మిచిగాన్, ఒహియో, ఫ్లోరిడా   రాష్ట్రాల్లో ఉన్నట్లు సీడీసీ తెలిపింది. కాగా ఈ బ్యాక్టీరియా అతి తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉండగా..  వ్యాధి సోకిన వారు పూర్తిగా కోలుకునేందుకు  నాలుగు వారాల సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడీసీ తాజాగా పేర్కొంది.

 ఈ లిస్టిరియా పండ్లతో కలిసి రిఫ్రిజిరేటర్‌లో జీవించడంతో పాటు ఇతర ఆహార పదార్ధాలు, వాటి ఉపరితలాలకు సులభంగా వ్యాపిస్తుందని సీడీసీ పేర్కొంది. కాగా, లిస్టిరియా అనేది అరుదైన బ్యాక్టీరియా కాగా ఇది ఆహార పదార్ధాల ద్వారా గర్భిణీలు, నవజాత శిశువులతో పాటు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు సోకితే ప్రమాదమని సీడీసీ తెలిపింది. ఇది సోకితే లిస్టెరియోసిస్‌కు కారణమవుతుందని.. ఇది జ్వరం, కండరాల నొప్పులు, అలసటతో పాటు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో సెప్సిస్ లేదా మెనింజైటిస్‌కు కారణమవుతుందని తెలిపారు. దీంతో దాదాపు 20-30% మరణాల రేటుతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని తెలిపారు. సీడీసీ నివేదిక ప్రకారం, జూన్ 30, 2022న ఫ్లోరిడాలో మొదట లిస్టెరియాను గుర్తించారు.