ఆర్ధిక అవకతవకలపై సీఎం, మంత్రులకు హైకోర్టు నోటీసులు.. చరిత్రలోనే తొలిసారి! | high court notices to jagan| financial| manipulations| rrr| petition| ministers| sensation| first
posted on Nov 23, 2023 3:27PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా మరో రికార్డు బద్దలు కొట్టారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకాకపోవడం, ఒక టర్మ్ మొత్తం బెయిల్ మీదనే రాష్ట్రాన్ని పాలించడంలో ఇప్పటికే అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించిన సీఎం జగన్.. ఇప్పుడు మరో యునీక్ రికార్డు సాధించారు. ఒక ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతుందన్న అభియోగంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి నోటీసులు అందుకున్న తొలి సీఎంగా నిలవడమే ఆ రికార్డు. అయితే ఈ నోటీసులు తాను ఒక్కడే కాకుండా ఆయన కేబినెట్ మంత్రులు కూడా అందుకోవడం కొసమెరుపు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈ నాలుగున్నరేళల్లో ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, సీబీఐతో విచారణ జరిపి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి ముఖ్యమంత్రి జగన్ , పలువురు మంత్రులు, అధికారులు సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, ఇసుక తవ్వకాలు, మద్యం అమ్మకాల మాటున తీవ్రమైన ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయని చాలా కాలంగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు ఈ ఆరోపణలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారే తప్ప సమాధానం చెప్పింది లేదు. దీంతో సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని.. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వాదించారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది ఎందుకు విచారణ చేయాలో కోర్టుకు వివరించారు. అంతేకాదు, కోర్టులో పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కేసు విచారణకు డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీఎంకు, మంత్రులకు, ప్రభుత్వంలో కీలకమైన అధికారులకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నోటీసులపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారి ఇలా పాలనపై కోర్టు నోటీసులు అందుకోవడం ఇదే తొలిసారి. పాలనలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీఎం జగన్‌కే కాకుండా.. పలువురు మంత్రులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం పాలనా వర్గాలలో హీట్ పుట్టిస్తున్నది. స్కీంల పేరిట, ఇసుక, మద్యం టెండర్ల పేరిట భారీ స్థాయిలో నగదు చేతులు మారిందనే ఆరోపణలపై న్యాయస్థానాలు కలగజేసుకునే స్థాయికి జగన్ పాలన దిగజారిందనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతోంది.
కాగా ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రికార్డులు ధ్వంసం చేసినట్లుగా రఘురామ తరపు లాయర్ చెప్పడం కూడా రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇసుక తవ్వకాలకు సంబంధించిన రికార్డులను ఇటీవలి కాలంలో తగులబెట్టిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఇప్పుడు హైకోర్టులో లాయర్ రికార్డుల ధ్వంసం ప్రస్తావనకు బలం చేకూరినట్లైంది. ఎంపీ రఘురామ ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సీబీఐని వివరణ కోరింది. ఇప్పుడు ఇలా జగన్ పాలనలో అవకతవకలు చేశారని, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ పై కూడా విచారణ మొదలైంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు కూడా కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై సీబీఐ విచారణ చేపట్టి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ జగన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రఘురామకృష్ణం రాజు కూడా అన్ని ఆధారాలతో ప్రభుత్వ అవకతవకలపై పిటిషన్ వేశారు. ఇది కూడా జగన్ మెడకి చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే జగన్ తో పాటు ఆయన కేబినెట్ లోని పలువురు మంత్రులకు కూడా ఇబ్బందులు తప్పవు.