తెలుగుదేశం, జనసేన పొత్తు సరే.. బీజేపీ సంగతేంటి? | what about bjp in ap| janasena| tdp| alliance| fix| telangana| elections
posted on Nov 24, 2023 9:02AM
తెలుగురాష్ట్రాలలో బీజేపీ తీరు తమాషాగా ఉంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా ఆ పార్టీ తన వాస్తవబలానికి మించి బిల్డప్ ఇస్తోంది. ఇందుకు ఆయా రాష్ట్రాలలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు కొంత కారణమైతే.. కేంద్రంలో అధికారం చేతిలో ఉంది కనుక ఎలా వ్యవహరించినా, ఏం చేసినా అడిగేవారెవరూ ఉండరన్న అహంభావం అసలు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. ఆ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకూ అధికారం మాదే అన్న స్థాయిలో చెలరేగిన బీజేపీ ఎన్నికల వేళ వాస్తవ స్థితి తెలుసుకుని పొత్తులకు వెంపర్లాడింది. ఒక వైపు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తో రహస్య మైత్రి ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటూనే.. జనసేనతో మైత్రిని పొత్తుగా మలచుకుని ఎన్నికల బరిలోకి దిగింది. సరే ఆ పొత్తు, ఆ మైత్రి సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో ఆ పార్టీ అధికార రేసు నుంచి పూర్తిగా వెనుకబడిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పలు సర్వేలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి.
ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే…ఆ రాష్ట్రంలో బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేదు. కానీ ఆ పార్టీ అగ్రనేతలు బీఎల్ సంతోష్, జీవిఎల్ నరసింహారావు వంటి వారు మాత్రం ఏపీలో అధికారమే బీజేపీ లక్ష్యం అని గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. వీరి తీరు ఎలా ఉంటుందంటే.. అడుగు గడప దాటదు కానీ మాటలు మాత్రం కోటలు దాటేస్తాయి అన్నట్లు ఉంటుంది. తెలంగాణలో జనసేన పొత్తు విషయంలో ఉన్న క్లారిటీ బీజేపీలో ఏపీలో జనసేనతో మైత్రి విషయంలో ఏ మాత్రం కనిపించదు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం ఏకపక్షంగా ఏపీలో కూడా జనసేన తమ మిత్రపక్షమే అని బల్లగుద్ది మరీ చెబుతారు. కానీ ఏపీలో ఇప్పటికే జనసేన తెలుగుదేశంతో పొత్తులో ఉందికదా అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వరు. ఏపీలో బీజేపీని విస్మరించి మరీ తెలుగుదేశంతో జనసేన పొత్తు పెట్టుకుందనడంలో సందేహం లేదు. ఇరు పార్టీలూ ఇప్పటికే సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకూ, ఉమ్మడిగా ప్రచారానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
అయినా కూడా బీజేపీ జనసేన తమ మిత్రపక్షమే అని బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. దీంతో ఏపీలో రాజకీయంగా బీజేపీ అడుగులు ఎటు అన్న విషయంలో బీజేపీకి ఒక క్లారిటీ లేదు. ఆ పార్టీ శ్రేణులే కాదు, నాయకులు కూడా ఈ విషయంలో అయోమయంలోనే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశంతో జనసేన పొత్త కుదుర్చుకుంది కదా మీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే అన్న ఒక్క ముక్కతో బదులిచ్చేసి రాష్ట్ర నాయకత్వం చేతులు దులిపేసుకుంటోంది.
బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఒంటరిగా పోటీ చేసినా ఏపీలో ఆ పార్టీకి దక్కేదీ, పోయేదీ కూడా ఏదీ లేదన్నది సుస్పష్టం. అయితే ఏపీలో తమ మిత్రపక్షమైన జనసేన, టిడిపితో పొత్తు పెట్టుకొందని తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర నేతలు జనసేనతో కలిసే సాగుతామని చెప్పడం వెనుక అంటే తెలంగాణ ఎన్నికల తర్వాత జనసేన, టీడీపీ కూటమితో బీజేపీ కూడా కలిసి వెళుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే బీజేపీ హై కమాండ్ తెలుగుదేశంతో పొత్తు వద్దని భావిస్తే.. ఆ పార్టీ ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని తెలుగుదేశంకు దూరం చేయడం. అది సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టేశారు. ఏపీతో తమ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెడుతుందని ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించేశారు. సీట్ల సద్దుబాటు, క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి మేనిఫెస్టో వంటి వాటిపై చర్చలు సాగుతున్నాయి.
అవికూడా దాదాపుగా కొలిక్కి వచ్చేశాయని తెలుగుదేశం, జనసేన నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల కేడర్ కలిసి పని చేస్తున్నాయి. తెలుగుదేశంకార్యక్రమాలలో జనసేన జెండాలు, జనసేన కార్యక్రమాలలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. సో బీజేపీకి ఇక ఒకే ఒక ఆప్షన్ మిగిలింది. అదేమిటంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పొత్తు పెట్టుకోవడం. అయితే అదీ జరిగే పనిగా కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్ సర్కార్ అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక రకంగా యుద్ధమే చేస్తున్నారు. అధిష్ఠానం అనుమతి, ఆశీస్సులూ లేకుండా ఆమె ఈ పని చేస్తున్నారని భావించలేం. కనుక వైసీపితో బీజేపీ పొత్తు పెట్టుకొనే ప్రశక్తే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగని ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధపడే పరిస్థితి కూడా లేదు. ఒక వేళ అలా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినా.. ఆ పార్టీకి ఉన్న ఒక శాతం కంటే తక్కువ ఓటు స్టేకుతో పోటీ చేసిన ఏ స్థానంలోనూ కూడా డిపాజిట్ దక్కించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా బీజేపీ అధిష్టానం ఏపీలో పొత్తులపై నిర్ధిష్ట ప్రకటన చేయడం ఖాయమే. ఆ ప్రకటన ఎలా ఉండబోతుందన్నది అందరూ ఊహించగలిగిందేనని అంటున్నారు.