మేడిగడ్డ డ్యామేజ్ నిజమే.. కేటీఆర్ ఒప్పుకోలు! | medigadda damage true| ktr accept| say| it| is| common| extra| cost| great| project
posted on Nov 24, 2023 10:38AM
బుకాయింపులు పని చేయలేదో ఏమో తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వాస్తవమేనని అంగీకరించారు. అయితే కింద పడ్డా పై చేయి నాదేనని చెప్పుకోవడానికి బ్యారేజీలలో సమస్యలు రావడం సర్వసాధారణమని సూత్రీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం కూడా అలాంటి సర్వసాధారణమైన విషయమేనని కేసీఆర్ తేల్చేశారు.
నాగార్జున సాగర్ లో అది నిర్మించిన కొత్తల్లో లీకేజీలు లేవా? అని ప్రశ్నించారు. శ్రీశైలం పంపులు కూడా నీట మునగలేదా అన్నారు. ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయని చెప్పి మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ పెద్ద విషయం కాదనీ సమర్ధించుకోవడానికి శతధా ప్రయత్నించారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్ గురువారం (నవంబర్ 23)న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారంటూ చిర్రుబుర్రులాడారు. ప్రాజెక్టులలో సమస్యలు వెరీ కామన్.. వాటిని భూతద్దంలో చూడొద్దన్నారు.
లోపాలను పట్టించుకోవద్దనీ, ఈ తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో ప్రగతిని మాత్రమే చూడండని చెప్పకొచ్చారు. కేసీఆర్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులపై లక్షా 70వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందని గణాంకాలు చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని తమ సర్కార్ కేవలం నాలుగున్నర సంవత్సరాలలో పూర్తి చేసిందని గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏమైనా ఇంజినీరింగ్‌లో లోపాలు ఉంటే సవరణలు చేయడంతో పాటు పునర్నిర్మాణపనులు చేపడతామని నిర్మాణ కంపెనీ చెబుతుంటే ఇక విమర్శలెందుకని నిలదీశారు. రాజకీయం కోసమే కాళేశ్వరంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. మొత్తం మీద మేడిగడ్డ డ్యామేజీ నిజమేనని ఒప్పుకున్నారు.