Leading News Portal in Telugu

నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు.. ఎందుకో తెలుసా? | ed notice to prakash raj| advertise| jewellery| scheme| modi| sarkar


posted on Nov 24, 2023 8:11AM

దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడుకోవడంలో మోడీ సర్కార్  ఇసుమంతైనా వెనుకాడదు. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై అస్త్రాలుగా ఉపయోగించడం ఎంత దాకా వెళ్లిందంటే కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ, సీబీఐలను తన ఇష్టాను సారంగా ఉపయోగించుకుంటుంటే.. రాష్ట్రాలు తమ ప్రభుత్వ అధీనంలో ఉండే దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారంగా రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు వినియోగిస్తున్నాయి. ఈ మాట ఒక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అన్నారు. ఫామ్ హౌస్ కేసు సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఉద్దేశించి మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారంటే దర్యాప్తు సంస్థల పరిస్థితి ఏలా మారిపోయిందో అర్ధమౌతుంది. 

ఇక ఏపీ విషయమైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ సీఐడీ ఆ రాష్ట్రంలోని అధికార వైసీపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది. విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ సహా వరుసగా ఒకదాని వెంట ఒకటిగా నమోదు చేసిన, చేస్తున్న కేసులను చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది.

ఇక విషయానికి వస్తే తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈడీ, సీబీఐల లక్ష్యం కేంద్రంలో మోడీ సర్కార్ ను వ్యతిరేకించే పార్టీల నేతలు, వ్యక్తులేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతన్న సంగతి తెలిసిందే. మోడీని, ఆయన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారిపై ఈడీ సోదాలు, సీబీఐ దర్యాప్తులు తప్పవని సామాన్య ప్రజానీకం కూడా భావిస్తున్నారంటేనే ఆ దర్యాప్తు సంస్థల పని తీరు ఎలా ఉందన్నది అవగతమైపోతుందని పరిశీలకులు అంటున్నారు. అయిన దానికి , కాని దానికీ కూడాఈడీ కేసులు నమోదు చేస్తూ పోతోందంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఏదో ఒక విధంగా ఈడీ నోటీసులు జారీ చేయడమన్నది పరిపాటిగా మారిపోయింది. తాజాగా    ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు అందజేసింది.

ఇందుకు ఈడీ చెప్పిన కారణమేమిటంటే ఆయన మహదేవ్ యాప్ అనే ఒక  యాప్ కు ప్రచారం చేశారు. అంటే ఆయన నేరుగా ఆ యాప్ కు ప్రచారం చేయలేదు. కానీ కేరళలో ఓ చిన్న జ్యూయలరీ షాప్ కు ఒక ప్రకటన చిత్రంలో నటించారు.  అంతే  ఈడీ రంగంలోకి దిగిపోయింది. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ  సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. దానికీ ప్రకాష్ రాజ్ కు నోటీసులకూ సంబంధం ఏమిటి అంటే.. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. అందుకే ఆయనను విచారణకు పిలిచినట్లు ఈడీ పేర్కొంది.

సాధారణంగా ప్రతి బంగారం దుకాణం ఓ స్కీమ్ నిర్వహిస్తూ ఉంటుంది. పదకొండు నెలలు కిస్తీలు కడితే.. పన్నెండో నెల తాము యాడ్ చేసి బంగారం ఇస్తామని చెబుతూ ఉంటాయి. అలాంటి స్కీమ్ ద్వారా .. ప్రణవ్ జ్యూయలర్స్ వంద కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. అయితే  ఆ జ్యువెల్లరీ సంస్థ ఆ విధంగా వందల కోట్లు వసూలు చేసినా.. అందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఏముంటుందన్న ప్రశ్నకు మాత్రం ఈడీ సమాధానం చెప్పడం లేదు. సదరు జ్యవెల్లరీ సంస్థకు చెందిన యాడ్ లో ప్రకాష్ రాజ్ ప్రచార కర్తగా నటించి ఉంటారు. అందుకు ఎంతో కొంత సొమ్ము తీసుకుని ఉంటారు. దానికీ సదరు జ్వువెల్లరీ సంస్థ స్కీమ్ పేరుతో వసూలు చేసిన వ్యవహారానికీ ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏముంటుంది?   బీజేపీని, మోదీని తీవ్రంగా విమర్శించేవారిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా మోడీ తీరును, విధానాలనూ ప్రకాష్ రాజ్ తూర్పారపడుతుంటారు. అందుకే ఈడీ ఆయనకు ఒక జ్యువెల్లరీ సంస్థకు ఇచ్చిన ప్రకటన నెపంతో నోటీసులు జారీ చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.