ఎన్నికల తాయిలాలు పెంచేసిన కేసీఆర్! దళితుల ఓట్ల కోసం కొత్త వ్యూహాలు | kcr new strategies and promises| dalit| votes| dalit
posted on Nov 25, 2023 9:06AM
దళితబంధు వంటి సంక్షేమ పథకాలు తమ పార్టీని తెలంగాణలో ముచ్చటగా మూడో సారి గెలిపిస్తాయన్న నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ముఖ్యంగా రిజర్వుడు స్థానాలలో పాగా వేయగలిగితే మరో సారి అధికార అందలాన్ని అందుకోవడం ఏమంత కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే దళిత బంధు విషయంలో ఆయన తన హామీ రేంజ్ ను పెంచేశారు. ఇప్పటి వరకూ విడతల వారీగా నియోజకవర్గానికి వంద మందికి చొప్పును అందిస్తున్న సంగతి తెలిసిందే.
మరో సారి అధికారాన్ని అందుకోవడానికి దళిత బంధునే గట్టిగా నమ్ముకున్న కేసీఆర్ మరో సారి అధికారం అప్పగిస్తే ఈ పథకాన్ని నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తింప చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సారి ఎన్నికలలో ప్రభుత్వంపై దళితులు వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశంతోనే.. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలో దళితులందరికీ వర్తింప చేస్తానన్న హామీతో వారి అభిమానాన్ని తిరిగి పొందాలన్న వ్యూహంతోనే ఈ హామీ ఇచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ అందేలా కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. తొలి విడతలో నియోజకవర్గానికి వంద మందికి అనీ, రెండు విడతలో నియోజకవర్గానికి 11 వందల మందికీ అని గతంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, రెండు విడత హామీని బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదు. పథకం అమలుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది. దీంతో దళితులు కేసీఆర్ హామీ ఇచ్చి తరువాత దానిని విస్మరించడం అలవాటుగా మార్చుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు హామీలను ఆయన పబ్బం గడిచిన తరువాత ఏలా వదిలేశారో గుర్తు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే దళితుల ఆగ్రహాన్ని చల్లార్చి వారిని బీఆర్ఎస్ వైపు మళ్లించేందుకే రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు అంటూ కొత్త నినాదాన్ని బయటకు తీశారని అంటున్నారు. దీంతో ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకు వస్తారా? అని కేటీఆర్ పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే కేసీఆర్ ఎన్నికల ముంగిట చేసిన ఈ వాగ్దానాన్ని వారు విశ్వసించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కలిపి 31 ఉండగా వాటిలో మూడు మినహా మిగిలిన నియోజకవర్గాలలో ఉన్న సిట్టింగులంతా బీఆర్ఎస్ ఎమ్యెల్యేలే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు మూడూ కూడా ఖమ్మం జిల్లాలోనే ఉండటం గమనార్హం. అయితే సిట్టింగులు ఉన్న 28 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తున్నదని సర్వేలు చెబుతున్నాయి. ఇక గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఖాతాలో పడని మధిర, ములుగు, భద్రాచలం నియోజకవర్గాలలో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఆ నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులంటూ హామీ ఇస్తున్నారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో పాగా కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, పన్నుతున్న వ్యూహాలు, ఇస్తున్న వాగ్దానాలు ఏమేరకు ఫలిస్తాయన్నది ఫలితాల తరువాతే తేలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.