Leading News Portal in Telugu

ప్రశాంతంగా రాజస్థాన్ లో పోలింగ్.. గెలుపెవరిదో మరి? | who will win rajasthan| congress| bjp| caste| equations| antiincumbency| bjp| changes| voters


posted on Nov 25, 2023 12:28PM

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. అయితే మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకోవడం ఏ పార్టీకైనా కష్టమే. దీంతో ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల తరువాత విపక్షానికే పరిమితం కావడం తథ్యమని బీజేపీ చెబుతోంది.  

మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో శనివారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం ఎంత? అన్నది పక్కన పెడితే.. వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకుని రికార్డు సృష్టించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంటే..  గెహ్లాట్  పాలనా తీరే జనం తమపైపు మొగ్గు చూపేలా చేస్తాయని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నది.  రాజస్థాన్ లో అధికార  కాంగ్రెస్, ప్రతిపక్ష  బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ ఉచితాలపై ఆధారపడింది. అదే సమయంలో  గత ఎన్నికల్లో పరాజయాన్ని మరిచిపోయి ఈ సారి విజయం సాధించేందుకు  బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

 ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షా సహా కమలం పార్టీ పెద్దలంతా  రాజస్థాన్ లో విస్తృత పర్యటనలు జరిపారు.   అశోక్ గెహ్లాట్ సర్కార్‌పై విమర్శల బాణాలు సంధించారు.   డబుల్ ఇంజన్ సర్కార్  ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. రాజస్థాన్ ప్రజల సమస్యలు గోహ్లాట్ పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. 

అయితే రాజస్థాన్ లో ఎవరెంతగా ప్రచారం చేసినా గెలుపోటములను నిర్ణయించేది మాత్రం సామాజిక వర్గాల వారీగా ఆయా పార్టీలకు లభించిన మద్దతు మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. రాజస్థాన్ లో కులాల ప్రభావం, ప్రాబల్యం రాజకీయాలపై ఎక్కువగా ఉంటుంది. అందుకే పార్టీలన్నీ కూడా ఇక్కడ ఎన్నికలు అనగానే సిద్ధాంత, రాద్ధాంతాలు, ప్రగతి, సంక్షేమం వంటి వాటితో సమానంగా సామాజిక సమీకరణాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తాయి.  టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికల వాగ్దానాల వరకూ కూడా ఈ సమీకరణాలకే పార్టీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి.  ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో వివిధ కుల సంఘాల మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ కుల మహాసభలకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. రాజస్థాన్‌లో  కులాల సంఖ్య ఎక్కువే అయినా రాజకీయాలను ప్రభావితం చేసే సాజామాక వర్గాలు కొన్నే ఉన్నాయి. అవే పార్టీల గెలుపు ఓటములను శాశిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ సామాజిక వర్గాలలో  ఏ ఒక్క సామాజిక వర్గానికీ రాష్ట్ర రాజకీయాలై తిరుగులేని గుత్తాధిపత్యం అయితే లేదు. ప్రధానంగా రాజస్థాన్ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన బలం ఉన్న సామాజిక వర్గాలలో  జాట్‌, రాజ్‌పుత్‌, మీనా, గుజ్జర్‌, బ్రాహ్మణ వర్గాలు  ముందు వరుసలో ఉంటాయి. అయితే ఆయా సామాజిక వర్గాల ప్రభావం, ప్రాబల్యం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా  ఉంటుంది.  

గత ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన జాట్ సామాజిక వర్గం ఈ సారి కూడా ఆ పార్టీకే వత్తాసు పలికే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా అయితే జాట్ ను బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉండాల్సి ఉంది. అయితే బీజేపీ వసుంధరారాజె ను పక్కన పెట్టంతో ఆ వర్గం కమలం పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. ఇక జాట్ ల తరువాత రాష్ట్ర రాజకీయాలలో తనదైన ప్రభావం చూపగలిగిన మరో సామాజిక వర్గం గుజ్జర్ సామాజిక వర్గం. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత అయిన  సచిన్ పైలట్  ఈ వర్గానికి చెందిన వారే. 

 సచిన్ పైలట్‌ ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో 2018 ఎన్నికల్లో గుజ్జర్లు కాంగ్రెస్‌ కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు.. సచిన్ పైలట్‌ కు డెప్యూటీ సీఎం పదవికి పరిమితం చేసింది. ఆ పదవి కూడా ఇచ్చినట్లు ఇచ్చింది. తరువాత ఆ పదవి నుంచీ పైలట్ కు ఉద్వాసన పలికింది. ముఖ్యమంత్రి గెహ్లాట్ తో సచిన్ పైలట్ సంబంధాలు టామ్ అండ్ జెర్రీ తరహాలో ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఐదేళ్లూ వారి మధ్య సంబంధాలు ఉప్పూనిప్పు చందంగానే సాగాయి. ప్రతి సారీ హైకమాండ్ జోక్యం చేసుకోవడం.. సర్దుబాటు చేయడంతోనే ఈ సమయమంతా గడిచింది.   దీంతో  గుజ్జర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడంలో సందేహం లేదు.  రాష్ట్రంలో రాజ్ పుత్ సామాజిక వర్గానికి కూడా రాజకీయాలను ప్రభావితం చేయగలిగేంత బలం  ఉంది. ఈ సామాజిక వర్గం తొలి నుంచీ కూడా కమలం పార్టీకి దన్నుగా నిలిచారనే చెప్పలి. ఈ సారి కూడా రాజ్ పుత్ లు కమలం పార్టీకే మద్దతుగా నిలిచారన్నది పరిశీలకుల విశ్లేషణ. అయితే సంస్థాగతంలో విపక్ష బీజేపీ పార్టీలో చేసిన మార్పులు ఆ పార్టీని ఆయా సామాజిక వర్గాలకు ఒకింత దూరం చేశాయన్న అబిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో  గెహ్లాట్ సర్కార్ పై ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో కూడా బీజేపీ విఫలమైంది. అలాగే  వసుంధరరాజె వంటి బలమైన నాయకులను పక్కన పెట్టడం కూడా రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడానికి ఒక అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో  రాజస్థాన్ లో   ఏ పార్టీ రెండు సార్లు వరుసగా గెలవదు అన్న సంప్రదాయం కొనసాగుతుందా అంటే అనుమానమే అంటున్నారు.