Leading News Portal in Telugu

జగన్ సర్కార్ పారదర్శకత.. డొంకతిరుగుడు జీవోలు.. పచ్చి అబద్దాలు! | jagan government transparency lies| secret| gos| court| orders| violate| vizag| millinium| towres| public


posted on Nov 26, 2023 6:46AM

జగన్ పాలనలో పారదర్శకత అన్నది దేవతావస్త్రంలా తయారైంది. జగన్ చెప్పే మాటల్లో తప్ప పాలనలో ఎక్కడా పారదర్శకత ఉండదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉత్తుత్తి ఆదేశాలు ఇస్తారు. ఆ సంగతి తెలుసుకనుక అధికారులు వాటిని అమలు చేయరు. ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంది. కానీ అవి ఎవరికీ, ఎక్కడా కనిపించవు.  కోర్టులకు మాత్రం తమ ప్రభుత్వం అత్యంత పాదర్శనకంగా పాలన సాగిస్తోందని చెబుతుంది. కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి  విరుద్ధంగా ప్రభుత్వ పాలన ఉంటుంది. సింపుల్ గా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన ఇదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ జగన్ సర్కార్ ఎన్నో రహస్య జీవోలను ఇచ్చింది. ప్రతి జీవో పబ్లిక్ డొమైన్ లో ఉండాలని అన్ని శాఖాలను ప్రభుత్వం ఆదేశిస్తుంది. నాలుగున్నరేళ్లలో నాలుగుసార్లు ఇలాంటి ఆదేశాలిచ్చారు. కానీ  జీవోలు పబ్లిక్ డొమైన్ లోఉండవు. అలాగే ప్రభుత్వ భవనాలకు రంగుల నుండి ఇంగ్లీష్ మీడియం విద్య వరకూ న్యాయస్థానాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి   మొట్టి కాయలు వేసింది. కానీ కోర్టులు ఏవి వద్దన్నాయో వాటినే జగన్ సర్కార్ చేసింది.   చివరికి రాజధాని అంశంలో కూడా అంతే. అసలు మూడు రాజధానులు వ్యవహారాన్నిజగన్ ప్రభుత్వం మొదటి నుండి ఒక రహస్య అజెండాగానే కొనసాగిస్తోంది.

 సీఎం జగన్ లక్ష్యం, విధానం మూడు రాజధానులు. కానీ మూడు రాజధానుల ఏర్పాటు చేస్తూ అప్పట్లో ఇచ్చిన జీవోలలో ఎక్కడా మూడు రాజధానులు అనే ప్రస్తావనే లేదు. పరిపాలన వికేంద్రీకరణ అనే పేరుతో జీవో ఇచ్చారు. అంటే మూడు రాజధానులు అన్నది టెక్నీకల్ గా కుదరని పని అన్న సంగతి   ప్రభుత్వానికి మొదటి నుంచీ తెలుసు. కానీ, అసలు విషయం ఏమిటో ప్రజలకు చెప్పకుండా మూడు రాజధానుల పేరుతో మోసం చేసింది. అది కోర్టులకు చేరడం, కోర్టులలో అసలు విషయం బయట పడడంతో జగన్ సర్కార్ చివరికి ఆ జీవోలను వెనక్కు తీసుకుంది. జీవోలను అయితే వెనక్కు తీసుకుంది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకూ వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానుల జపం మానలేదు. చేస్తూనే ఉన్నారు. అయినా మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు కోర్టులలో ఉండగా.. ప్రభుత్వం దాని ప్రస్తావన తేకూడదు.  కానీ, నేతలు మాత్రం మూడు రాజధానుల అంశం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మూడు రాజధానుల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

ఇక్కడ కూడా ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు, కోర్టులకు అబద్దాలే చెబుతోంది. మూడు రాజధానుల అంశం కోర్టులో ఉండగానే విశాఖ రుషికొండకు బోడిగుండు చేసి   అక్కడ కార్యాలయాలను కడుతున్నది. కట్టేది రాజధాని భవనాలే అయినా పేరుకి మాత్రం అవి వాటిని పర్యాటక భవనాలుగా పేర్కొంటున్నది. మూడు రాజధానులు అని  చెప్పలేక జగన్ విశాఖ నుండి  పాలన చేస్తారని చెప్తుకుంటోంది. చివరికి ఇప్పుడు విశాఖలో మినిస్టర్ ఆఫీసుల కేటాయింపు  కూడా డొంక తిరుగుడుగానే చూపిస్తున్నారు. విశాఖకు మంత్రుల కార్యాలయాలు తరలించేందుకు మిలీనియం టవర్స్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. వైసీపీ నేతలేమో విశాఖకు రాజధానిని తరలిస్తున్నామని చెప్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్షలు చేయడానికి వెళ్తున్నారని, అందుకోసమే ప్రభుత్వ కార్యాలయాలను మారుస్తున్నారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే ఇక్కడ కూడా అబద్దాలు..   మోసం.

 సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొత్తలో ప్రభుత్వం అంటే పారదర్శకత ఉండాలని.. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పిన రేంజిలో డైలాగులు చెప్పారు.  కానీ.. ఆచరణ  మాత్రం   పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయాన్ని ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించాలి. అప్పుడే ప్రజాభిప్రాయం తెలుస్తుంది.   మూడు రాజధానుల అంశంలో రాజ్యాంగం ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిపోతున్నది.. కోర్టులు వద్దంటున్నాయ్.. మేధావులు నష్టమని చెప్పుడో చెప్పారు. కానీ, ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు అడుగులు వేస్తోంది. కోర్టులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. అహంభావంతో అబద్ధాలతో పబ్బం గడిపేయగలననుకుంటోంది. గతంలో ఇలానే అనాలోచిత నిర్ణయాలు తీసుకొని భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఇప్పుడు కూడా విశాఖలో నిర్మాణాలు, కార్యాలయాల తరలింపునకు ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది.   రేపు కోర్టులలో వ్యతిరేక తీర్పులొస్తే ఇప్పుడు చేసిన ఖర్చంతా  బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది!