Leading News Portal in Telugu

చంద్రబాబు హస్తిన పర్యటనపై వైసీపీ స్పెషల్ ఫోకస్? | tension in ycp on babu delhi tour| special| focus| skill| regular| bail| quash| verdict| national| media| court| notice


posted on Nov 27, 2023 5:56AM

స్కిల్ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయడంతో   దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళీ చంద్రబాబు  ప్రజల మధ్యకి రాబోతున్నారు. డిసెంబర్ లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు తెలుగుదేశం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.   ఈ నెలాఖరులోగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా తేలిపోతుంది.  అయితే, ఈలోగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండడం హాట్ టాపిక్ గా మారింది.

సరిగ్గా ఈ నెలాఖరునే చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. దీంతో అధికార పక్షం వైసీపీలో టెన్షన్ మొదలైంది. సరిగ్గా కండిషన్ బెయిల్  ముగిసి రెగ్యులర్ బెయిల్ అమల్లోకి వచ్చే సమయం, సుప్రీంలో క్వాష్ పిటిషన్ తీర్పు వస్తుందనుకుంటున్న సమయానికి చంద్రబాబు ఢిల్లీలో ఉండటం వైసీపీని కంగారు పెడుతోంది. వాస్తవానికి  చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుంది రాజకీయ సమావేశాల కోసం కాదు. ఢిల్లీలో జరిగే ఓ పెళ్లి రిసెప్షన్ కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబుపై బనాయించిన కేసులను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సిద్ధార్థ లూధ్రా   కుమారుడి వివాహం ఈ నెల 26న జరగనుంది. అలాగే 27న ఢిల్లీలోనే రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కి చంద్రబాబు  హాజరు అవుతున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.  అలాగే చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజులు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చాలాకాలం అవుతున్నది. ఆ మధ్య ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీ వెళ్లారు. ఆ తరువాత చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లలేదు.  అన్నిటికీ మించి   అక్రమ అరెస్టు, బెయిల్ తర్వాత చంద్రబాబు హస్తిన  పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి.  ఇప్పటికే నారా లోకేష్  చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు అక్కడ ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తిగా మారింది.

 అలాగే చంద్రబాబు ఢిల్లీలో ఉన్న రెండు రోజులలో రాజకీయ ప్రముఖులను ఎవరినైనా కలుస్తారా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరున జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.  ఈ క్రమంలోనే చంద్రబాబు ముందుగానే ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాలపై కదలిక తెచ్చే అవకాశం ఉందా అని రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనపై వైసీపీ వర్గాలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేష్ జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడంతో జాతీయ స్థాయి నేతలు కూడా జగన్ సర్కారు తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ మీడియా కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టడంతో  అప్పట్లో సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్, సీఏజీ పొన్నవోలు సుధాకర్ అప్పట్లో హడావుడిగా ఢిల్లీ వెళ్లి  మీడియా మీటింగ్ కు పెట్టి మరీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక చంద్రబాబుకు జాతీయ మీడియాతో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఏం మాట్లాడనున్నారన్నటెన్షన్ వైసీపీలో కనిపిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు మళ్ళీ విచారణ మొదలైంది. ఇప్పటికే నోటీసులు కూడా అందగా జనవరిలో ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ కావడం, జగన్ బెయిల్ రద్దు కావడం వంటి కీలక పరిణామాలకు అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ బీజేపీతో రహస్య బంధం కొనసాగిస్తుంది. అయితే, రాష్ట్రంలో బీజేపీని తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైతే పరిణామాలేంటి అన్న అనుమానాలు వైసీపీకి ఉండడంలో ఆశ్చర్యం లేదు. దీంతో వైసీపీ పెద్దలు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఆందోళనకు లోనౌతున్నారని పరిశీలకులు అంటున్నారు.