Leading News Portal in Telugu

బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు.. బీటీమ్ విమర్శను నిజం చేస్తున్న నేతలు! | arvind praises kcr| criticize| revanth| telangana| elections| campaign


posted on Nov 27, 2023 5:17AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి.   28తో ప్రచారం కూడా   ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల దాడి పెంచి విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఒక్కోసారి విమర్శల వేడి పెరిగి నేతల నోట బూతులు కూడా వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేస్తున్నది. మరోవైపు విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నేతలంతా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన కేసీఆర్‌ కాంగ్రెస్ టార్గెట్ గా తీవ్ర విమర్శలకు దిగారు. వెళ్లిన ప్రతి చోటా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్న గులాబీ నేతలు.. ఎలక్ట్రినిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా అదే తరహా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణకు ఓటేసినట్లేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కివెళ్తుందని ఆరోపిస్తున్నారు.  

ఇక కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలపై ఫోకస్ పెట్టింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను లెక్కలతో సహా బయటపెడుతూ విమర్శలకు దిగి ప్రజలలో చర్చకు వచ్చేలా చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారం యువతను ఆకట్టుకొనేలా ఉంటుంది. పనిలో పనిగా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, కాళేశ్వరం మునక వంటి వాటిని హైలైట్ చేస్తూ తెలంగాణ ఏర్పాటుకు ముందు కేసీఆర్ కుటుంబం, రాష్ట్రం తర్వాత కేసీఆర్ కుటుంబం తేడాను వివరిస్తూ కాంగ్రెస్ నేతలు దూసుకెళ్తున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ పాలనలో పెరిగిన ధరలను వివరిస్తూ కేంద్రంలో ప్రభుత్వం మార్పుకు తెలంగాణనే తొలిమెట్టు కావాలని కోరుతున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలలోకి తీసుకెళుతున్నారు.

ఇక బీజేపీ విషయానికి వస్తే..   మూడు నెలల క్రితం వరకూ బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో ఇక్కడి నేతల విమర్శలు ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి అసలు పోటీలో లేదన్నట్లు బీజేపీ సైడ్ అయిపోయినట్లే కనిపిస్తున్నది. ఓ నలుగురైదుగురు బడా నేతల స్థానాలు తప్ప   రాష్ట్రంలో మరెక్కడా ఎక్కడా బీజేపీ ట్రయాంగిల్ పోటీలో కనిపించడం లేదు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే తెలంగాణ ఎన్నికలలో పోరు కనిపిస్తుంది. అయితే, సరిగ్గా ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ విమర్శలను నిజం చేసేలా మాట్లాడుతున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అంటూ కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలకు తగ్గట్లే తెలంగాణ బీజేపీ నేతలు వేస్తే తమకి ఓటేయండి లేదంటే బీఆర్ఎస్ కి ఓటేయండి కానీ కాంగ్రెస్ కు మాత్రం ఓటు వేయకండి అనేలా మాట్లాడుతున్నారు. ఇదేదో ఆషామాషీగా ఎవరో ఊహించుకున్న మాటలు కాదు.. అచ్చంగా తెలంగాణ బీజేపీ నేతలు పబ్లిక్ గా చేసిన వ్యాఖ్యలే.

బీజేపీ నిజామాబాద్ ఎంపీ, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల బ‌రిలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న ధర్మపురి అర్వింద్ పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన  అర్వింద్.. కాంగ్రెస్ నేతలపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడేవారు. అయితే, ఎన్నికల వేళ అస్సలు ఎవరూ ఊహించలేని వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే ముఖ్యమంత్రి  కేసీఆర్ బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అర్వింద్ ఈ  వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లు తెలంగాణ కోసం పోరాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ కోట్లాడేటప్పుడు రేవంత్ తెలుగుదేశంలో ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోసం.. అప్ప‌ట్లో సంచులు మోశాడ‌ని విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే ఆడుతున్నాడ‌ని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది తెలంగాణ‌ను వారి చేతిలో పెట్టిన‌ట్టే అని అన్నారు. బీజేపీ అభ్యర్థి కేసీఆర్‌పై అనుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం.. బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం ఇప్పుడు తెలంగాణలో రాజ‌కీయంగా విస్తృత చర్చకు తెరలేచింది. జనబాహుల్యంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటేనా అన్న చర్చ మొదలైంది..