Leading News Portal in Telugu

రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఉపసంహరించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం | cec withdraw permission to release raithu bandhu| funds| brs| shock| 70lac| farmers| 7thousand


posted on Nov 27, 2023 9:05AM

కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుని బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చింది. రైతు బంధు పథకం పాతదే, అమలులో ఉన్నదే అంటూ ఆ పథకం కింద నిధుల మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ అనుమతిని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రైతు బంధు నిధుల పంపిణీకి అవకాశం లేకుండా పోవడంతో బీఆర్ఎస్ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి.. అమలులో ఉన్న పాత పథకానికి నిధుల విడుదలకు అనుమతి నిరాకరించడం సరికాదనీ, రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇవ్వాలనీ కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేస్తూ మంగళవారం (నవంబర్ 28) లోగా నిధులు విడుదల చేయాలని షరతు విధించింది.

అయితే ఉన్నట్లుండి ఆ అనుమతిని ఉపసంహరించుకోవడంతో బీఆర్ ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లైంది. అనుమతించిన రెండు రోజులలోనే నిధుల విడుదలకు బ్రేక్ వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇప్పుడు నిధుల విడుదల ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది.   రెండు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడంతో రైతు బంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా 70లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 7వేల కోట్ల రూపాయలను జమ చేయడానికి బీఆర్ఎస్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసింది. గత రెండు రోజులుగా నేతలు తమ ప్రచార సభలలో ఇదే చెప్పారు. రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు మంగళవారం (నవంబర్ 28)  నాటికి  జమ అవుతాయని చాటారు.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆ అనుమతిని ఉపసంహరించుకుంటూ చేసిన ప్రకటనతో అది నిలిచిపోయింది.  సోమవారం గురు పౌర్ణమి కారణంగా బ్యాంకులకు సెలవు కావడంతో నిధుల పింపిణీ మంగళవారం చేపట్టి పూర్తి చేయాలని తెలంగాణలోని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆ అనుమతిని ఉపసంహరించుకోవడంతో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.   తెలంగాణ ఎన్నికలకు   పోలింగ్‌ గురువారం (నవంబర్  30) న జరగనుండగా,  ఇప్పుడు రైతు బంధుకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో  ఎన్నికల కమిషన్‌ అనుమతిని ఉపసంహరించుకుని ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.