జగన్ కు పరాభవం.. మోడీ వెంట తిరుమలకు నో పర్మిషన్?! | modi avoid jagan| tirumala| alone| leaving| ap| cm
posted on Nov 27, 2023 9:11AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఘోర పరాభవం ఎదురైందా? ప్రధాని నరేంద్రమోడీయే జగన్ ను అవమానించారా? అంటూ పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్రమోడీ తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో తన వెంట ఏపీ సీఎం జగన్ ను అనుమతించలేదు. సాధారణంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రధాని ఎవరైనా.. ప్రధాన మంత్రి హోదాలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలికి, కొండపైకి తీసుకు వెడతారు. అలాగే ప్రధానితో కలిసి తిరమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ఈ సంప్రదాయానికి బ్రేక్ వేశారు. తాజా తిరుమల పర్యటేనలో ఏపీ సీఎం జగన్ ను తనతో పాటు కొండపైకి వచ్చేందుకు అంగీకరించలేదు. ఆయన ఒక్కరే తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దీనిపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటించిన ఆయన తిరుపతి కూడా వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుపతి వచ్చిన ప్రధాని మోడీకి సీఎం జగన్ స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనకు బొకే ఇచ్చి, శాలువ కప్పి సన్మానించారు. వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా బహూకరించారు.
అంతే.. ఆ తరువాత జగన్ ప్రధానితో కలిసి జగన్ తిరుమల వెళ్లకపోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ వెంట తిరుమలకు వెళ్లే వారి జాబితాలో జగన్ పేరు లేకపోవడానికి పీఎంవో నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలే కారణమని అంటున్నారు. నేరుగా పీఎంవో నుంచే ఈ మేరకు ఆదేశాలు అందాయని చెబుతున్నారు. ఇందుకు కారణాలేమైనా తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, అలాగే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఏపీ ఎన్నికలు కూడా జరగనున్న తరుణంలో మోడీ ఇలా జగన్ ను దూరం పెట్టడంపై రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పరిశీలకులైతే చంద్రబాబు అక్రమ అరెస్టుకు మోడీ జగన్ ను దూరం పెట్టడానికీ ముడిపెడుతున్నారు.
ఇప్పటికే జగన్ చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేయించడం, ఆ అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఖండించకపోవడం, దానికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో నిరసనలను కేసీఆర్ సర్కార్ అణచివేయడానికి ప్రయత్నించడం, అలాగే చంద్రబాబు అరెస్టునకు బీజేపీ సహకారం, అనుమతి ఉందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో మోడీ జగన్ ను దూరం పెట్టి ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి ప్రయత్నించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో బీజేపీ ఏపీ కార్యవర్గ సమావేశం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
మొత్తంగా చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రభావంతో బీజేపీ తెలంగాణలో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుండటంతోనే మోడీ జగన్ ను దూరం పెట్టారని అంటున్నారు. అలా చేయడం ద్వారా తెలంగాణలో సెటిలర్లకు చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కేంద్రం పాత్ర లేదన్న సంకేతం ఇచ్చారని అంటున్నారు.