ఎన్నికల వేళ తెలంగాణలో రెండు వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు! | liquor sales high in telangana| assembly| election| 2000
posted on Nov 29, 2023 9:26PM
తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలు ఏ రేంజ్ లో పెరిగాయో తెలుసా ? నవంబర్ నెల మొదటి 20 రోజుల్లో 1470 కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయింది, మిగిలిన పది రోజుల లెక్క కూడా వస్తే… ఒక్క నవంబర్ నెల మద్యం అమ్మకాలు 2 వేల కోట్ల రూపాయలు దాటుతుందన్నది ఒక అంచనా. ఎన్నికల నేపథ్యంలో కేవలం నెలలోనే రెండు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయంటే.. మద్యం ఏ స్థాయిలో ఏరులై పారిందో అవగతమౌతుంది.
గత ఏడాది అంటే 2022 నవంబర్ నెలలో లిక్కర్ విక్రయాలు 1260 కోట్ల రూపాయలు మాత్రమే. అప్పట్లో అంత మొత్తం అమ్ముడుపోవటమే చాలా పెద్ద విషయంగా ఎక్సైజ్ వర్గాలు చెప్పుకున్నాయి. అలాంటిది ఇపుడు మొదటి 20 రోజుల్లో అమ్మకాలు రు. 1470 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైందంటే ఇది కచ్చితంగా కొత్త రికార్డుగానే చెప్పాలి. మొదటి 20 రోజుల్లో అమ్ముడుపోయిన లిక్కర్ ఒక ఎత్తయితే మిగిలిన పదిరోజులు అంటే 20-30వ తేదీ వరకు అమ్ముడవ్వబోయే లిక్కర్ మరో ఎత్తుగా మారబోతోందని అంటున్నారు. మొత్తంమీద లిక్కర్ అమ్మకాల్లో నవంబర్ మాసం అన్నీ రికార్డులను తిరగరాయటం ఖాయమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక గత ఏడాది నవంబర్ మొదటి 20 రోజుల్లో 12.5 లక్షల కార్టన్ల బీర్లు అమ్ముడుపోతే.. ఈ ఏడాది నవంబర్ మొదటి 20 రోజుల్లో 22 కోట్ల కార్టన్ల బీర్లు అమ్ముడు పోవటమే ఆశ్చర్యంగా ఉంది. దీంతోనే లిక్కర్ అమ్మకాల జోష్ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది.
ఎన్నికల ప్రచారమంటే, ఆ మాత్రం లేకపోతే ఎలా అంటున్నారు? ఏది ఏమైనా తెలంగాణాలో లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయట. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నదాంతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. విచిత్రం ఏమిటంటే లిక్కర్ అమ్మకాలు ఒకవైపు ఆకాశమంత ఎత్తున పెరిగిపోతుంటే మరోవైపు దాడుల్లో, సోదాల్లో పోలీసులు వందల కోట్ల రూపాయలు విలువైన మద్యాన్ని పట్టుకుంటున్నారు.
తెలంగాణా వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజైన దగ్గర నుండి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నారు. ఇందులో డబ్బు, బంగారం, వెండితో పాటు అనేక విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. ఇందులో బాగంగానే వందల కోట్ల రూపాయలు విలువ చేసే లిక్కర్ ను కూడా పట్టుబడటం విశేషం. 105 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ పట్టుబడిందంటేనే తరలిపోయిన లిక్కర్ ఇంకెంత ఉంటుందో అంచనా వేయచ్చు.
కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు అంటే మూడు రోజులు లిక్కర్ షాపులు, బార్లను మూసేశారు. దాంతో అభ్యర్ధులు ముందుజాగ్రత్తగా ఎవరికి వాళ్ళు వందల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ ను కొనేసి ఎక్కడెక్కడో స్టాక్ చేసుకున్నారు.