posted on Nov 29, 2023 12:31PM
ఎన్నికల ఓటమి భయమే, విజయం కష్టమన్న ఫ్రస్ట్రేషనో కానీ అభ్యర్థుల, వారి బంధువుల నోట అనుచిత వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రత్యర్థులను కాదు ఏకంగా ప్రజలనే దూషిస్తున్నారు. సభ్య సమాజం ఆమోదించని పదజాలంతో ఆ దూషణలు ఉంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రశాంత్ రెడ్డి సోదరుడు, బాల్కొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధితో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీకై, సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలు డబ్బులను ఏ తరహాలో డిమాండ్ చేస్తున్నారో తెలిపేలా ఉన్న ఆ ఆడియోలో మంత్రి సోదరుడు ఓటర్లను బండబూతులు తిట్టిపోశారు.
ప్రజలు డబ్బులు పిండుతున్నారని, ఓట్లు కొనేందుకు రూ.18.5 కోట్లు ఖర్చు అయిందని అజయ్ రెడ్డి చెబుతున్నట్లుగా ఆ ఫోన్ సంభాషణ ఉంది. ప్రస్తుతం అజయ్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు ప్రజలను ఇంత చులకనగా మాట్లాడడంపై బాల్కోండ నియోజకవర్గంలో తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మంత్రి అనుచరులు మాత్రం అది అజయ్ రెడ్డి గొంతు కాదని చెప్పి తప్పించు కోవాలని చూసతున్నారు. జిల్లాలో వైరల్‌గా మారిన ఈ ఆడియోలో మాట్లాడింది ఎవరనేది క్లారిటీ లేనప్పటికీ మంత్రి సోదరుడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఎన్నికల వేళ బయటకు వచ్చిన ఈ ఫోన్ సంభాషణ అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.