posted on Nov 30, 2023 2:00PM
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పకు జడ్ కేటగరి భద్రత కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బీఎస్ యెడ్యూరప్పకు జడ్ క్యాటగరి భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. యెడ్యూరప్పకు తీవ్రాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాలు నివేదిక ఆధారంగా ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్రహోంశాఖ పేర్కొంది.
అయితే ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కేవలం కర్ణాటక రాష్ట్రం వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. యెడ్యూరప్ప బీజేపీ కీలకమైన నాయకుడు. గతంలో బీజేపీని కర్నాటకలో అధికారంలోకి తీసుకురావడంతో యెడ్యూరప్పదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అయితే బీజేపీ హైకమాండ్ కర్నాటక సీఎంగా ఆయనను తొలగించి బస్వరాజ్ బొమ్మైకి పగ్గాలు అప్పగించినప్పటి నుంచీ కర్నాటకలో బీజేపీ డౌన్ ఫాల్ మెదలైంది.
ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. దాంతో యెడ్యూరప్పను పక్కన పెట్టడం వల్లనే నష్టం జరిగిందన్న భావన పార్టీ హై కమాండ్ లో మొదలైంది. అందుకే పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో యెడ్యూరప్ప పేరు చేర్చింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు యెడ్డీ సమాయత్తమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కేంద్రం జడ్ క్యాటగరి భద్రతను కల్పించింది.