టాలీవుడ్ లో టెన్షన్.. కారణమేంటంటే? | tension in tollywood| reason| telangana| election| new| government| congress| brs| industry
posted on Dec 2, 2023 3:12PM
ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారడం, ఒక్కోసారి అధికారంలో ఉన్న పార్టీయే మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ టెన్షన్ అనేది ఉంటుంది. టాలీవుడ్ ప్రముఖుల్లో వివిధ పార్టీలకు చెందినవారు ఉంటారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమకు చెందిన అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ వస్తోంది. అయితే ఒక్కో పార్టీ పాలసీ ఒక్కోలా ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమ గురించిగానీ, అందులోని సమస్యల గురించిగానీ పెద్దగా పట్టించుకోని సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మాత్రం సినీ పరిశ్రమ విషయంలో సానుకూలంగానే వ్యవహరించింది. ఈ విషయంలో టాలీవుడ్ ప్రముఖులు సంతోషంగానే ఉన్నారు.
తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా టాలీవుడ్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొందదని అంటున్నారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం (డిసెంబర్ 30) కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడతాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొందరంటుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ సారి ప్రభుత్వ మార్పు తథ్యమనీ మరి కొందరు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే పేర్కొన్నాయి. దీంతో టాలీవుడ్ లో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే వ్యవహరించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారితే.. వచ్చే కొత్త సర్కార్ పరిశ్రమ విషయంలో ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది అన్నదే ఆ టెన్షన్ కు కారణమంటున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలకి ఎక్స్ట్రా షోలు, టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కావాలి. ఇలాంటి వాటి వల్లే నిర్మాత పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటివరకు భారీ చిత్రాల నిర్మాతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేదోడు వాదోడుగానే ఉంది.
ఇప్పుడు అధికారం మారి కొత్త ప్రభుత్వం వస్తే టాలీవుడ్ పరిస్థితి ఏమిటన్నదే టాలీవుడ్ టెన్షన్ కు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ సర్కార్ టాలీవుడ్‌కి అనుకూలంగా ఉంటుందా, భారీ చిత్రాల నిర్మాతలకు కావాల్సిన అనుమతుల్ని ఇస్తుందా అన్న సందేహాలు సినీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.