సీఎం ఎవరు?.. ప్రమాణ స్వీకారం ఇప్పుడు లేనట్టేనా? | deadlock on cm post| highcommand| decession| tesnnino| congress| sworn| in
posted on Dec 4, 2023 5:30PM
ఎన్నికల ముందు కలిసికట్టుగా కనిపించిన కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతి నివురుగప్పిన నిప్పేనని మరో సారి ప్రస్ఫుటంగా తేలిపోయింది. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ లో ఐక్యత నీటిమీద రాతేనని అర్ధమైపోయింది. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఆ పార్టీలో సాగుతున్న మల్లగుల్లాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సీఎల్పీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. సీఎంను నిర్ణయించే అంటే ఎంపిక చేసే బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఆ తరువాత ఎన్నికైన అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించారు. ఆ రెంటినీ హై కమాండ్ కు పంపారు. అక్కడ నుంచీ హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి. గంటలు గడిచినా ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడలేదు. ఈ లోగా ఏం జరిగిందో ఏమో ఎల్లా హోటల్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, సుధీర్ బాబు, కోమటిరెడ్డి వెళ్లి పోయారు. అంతలోనే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ కమిటీ భేటీ అయ్యింది. ఆ భేటీ తరువాత సీఎం ఎవరన్నది తేలుతుందని భావిస్తున్నారు. అంతకు ముందు తెలంగాణ సీఎల్పీ భేటీ తరువాత సీఎల్పీ నేతగా, అంటే సీఎంగా రేవంత్ కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ, రేవంత్ సీఎంగా సోమవారం (డిసెంబర్ 4) సాయంత్రం 8.15 గంటలకు ప్రమాణం స్వీకారం చేస్తారనీ, భట్టి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా పదేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ రాష్ట్ర అవతరణ తరువాత తొలి సారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అయితే ఈ విజయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ అత్యంత కీలక పాత్ర వహించినప్పటికీ.. ముఖ్యమంత్రి రేసులో ఆయనతో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా నిలిచారు. ఆయన కూడా తన స్థాయిలో రాష్ట్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేయడమే కాకుండా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు కూడా ఉన్నప్పటికీ రేసులో మాత్రం రేవంత్, భట్టిలు మాత్రమే మిగిలారు. చివరికి ఇరువురిలో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపిందని వార్తలు వినిపించాయి. సీఎల్పీ సమావేశానికి ముందు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు కాకుండా తాను ఒక్కడిని మాత్రమే డిప్యూటీ సీఎం గా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు. అయితే వాటన్నిటినీ పూర్వపక్షం చేస్తూ.. సీఎం ఎవరన్న ప్రకటన ఎంతకూ వెలువడకపోవడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎల్లా హోటల్ నుంచి ముగ్గురు నేతలు వెళ్లిపోవడం, ఆ తరువాత మరి కొద్ది సేపటికే హైకమాండ్ పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్ కూడా ఎల్లా హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. హైకమాండ్ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లనున్నారని అంటున్నారు. దీంతో ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరో వైపు కాంగ్రెస్ తొలి నుంచీ చెబుతున్నట్లు కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటించిన డిసెంబర్ 9నే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుందనీ, అందుకే హై కమాండ్ నిర్ణయం వెలువడలేదనీ కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రేవంత్ కూడా ఎన్నికల ప్రచారంలో పదే పదే డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉండే అవకాశాలు లేవనే అభిప్రాయమే పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.