Leading News Portal in Telugu

 రేవంత్ కు సోనియా, రాహుల్ కంగ్రాట్స్  | Telangana new CM Revanth meets Congress top brass Sonia


posted on Dec 6, 2023 12:03PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం గురువారం జరగనుంది. దీంతో ఆయన ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి అధినాయకత్వాన్ని ఒప్పించే బాధ్యతను స్వయంగా ఆయనే భుజాన వేసుకున్నారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారిద్దరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రేపు జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారందర్నీ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

రేవంత్ రెడ్డి తొలుత పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్బంగా ఎంపీ స్థానానికి రేవంత్ రాజీ నామా చేశారు. అలాగే పార్లమెంటులో కొందరు ఎంపీలను రేవంత్ రెడ్డి కలిసారు. రూమ్ నెంబర్ 66లో పలు పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వాళ్లు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 

రేవంత్ సీఎం అవుతున్నారు. మరి డిప్యూటీ సీఎం ఇతర కీలక శాఖలు ఎవరెవరికి ఇవ్వాలి. సీఎం సీటుపై ఆశ పెట్టుకున్న సీనియర్లను ఎలా సంతృప్తి పరచాలి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సీనియర్లను బుజ్జగిస్తూనే పార్టీకోసం కష్టపడినవారికి, మహిళలకు, యువతకు మంత్రివర్గంలో పెద్దపీట వేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో సామాజిక సమీకరణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవం రోజు మంత్రి వర్గంపై కూడా స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది.