ఇక ప్రజాభవన్ గా ప్రగతి భవన్.. ప్రతి రోజూ ప్రజాదర్భార్! | pragati bhawan change prajabhawan| prajadarbar| everyday| iron| fensing
posted on Dec 6, 2023 10:59AM
ప్రగతి భవన్ అదో దుర్భేధ్యమైన కోట. ఇంత కాలం కేసీఆర్ క్యాంపు కార్యాలయం, అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ ను కేసీఆర్ మాజీ కాగానే ఖాళీ చేసేశారు. గత తొమ్మిదేళ్లుగా ప్రగతి భవన్ ప్రజలకు ప్రవేశించడానికి కూడా అవకాశం లేని నిషేధిత భవన్. ప్రజల దాకా ఎందుకు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, చివరాఖరికి మంత్రులకు కూడా అనుమతి లేనిదే ప్రగతి భవన్ గడీలు దాటి లోపలకు అడుగుపెట్టే అవకాశం లేదు. అదో దొరల కోట.
కేసీఆర్ తొలిసారిగా విజయం సాధించి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే ప్రగతి భవన్ ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రగతి భవనే సీఎం అధికారిక నివాసం. అప్పుడు ప్రతి రోజూ ప్రజా దర్బార్ లు జరిగేవి. సీఎం రోజూ వేల మందితో ములాఖత్ అయ్యేవారు. కానీ రాష్ట్ర విభజన తరువాత, కేసీఆర్ సీఎం అయిన తరువాత ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ప్రజలా వైపుకు చూసేందుకు కూడా భయపడేలా రోడ్డును ఆక్రమించి మరీ ఐరెన్ ఫెన్సింగ్ నిర్మించేశారు. జనాలకు అది ఎవరికీ ప్రవేశం లేని ఓ కోటలా మార్చేశారు. యాక్చువల్ ప్రగతి భవన్ కువెళ్లడానికి మూడు వందల మీటర్ల ముందు నుంచే పోలీసు బందోబస్తు.
కేసీఆర్ ప్రగతి భవన్ పాలనపై గత తొమ్మిదేళ్లలోనూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కోటలాంటి ఏర్పాట్లు చూసిన వారెవరికైనా మనం ఉన్నది ప్రజా స్వామ్యంలోనా, రాజరిక వ్యవస్థలోనా అన్న అనుమాలు వ్యక్తం అయ్యేవంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ ప్రయాణం అతి తరచుగా ఉండేది. అది కూడా రద్దీ పెద్దగా లేని సమయంలో కాకుండా సరిగ్గా అత్యంత బిజీగా ఉండే సమయాన్ని ఎంచుకుని ఆయన తన ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగించే వారు. దీంతో పంజాగుట్ట నుంచి ప్యాట్నీ వరకూ, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అల్వాల్ రైతు బజారు వరకూ ట్రాఫిక్ ను నిలిపివేసి పోలీసులు నానా హడావుడీ చేసే వారు. ఇకపై అలాంటి సమస్యలకు తావే ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పింది. అలాగే ఆ ప్రజా భవన్ లో నిత్యం ప్రజాదర్బార్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గురువారం (డిసెంబర్ 7) రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చే క్రమంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇరెన్ ఫెన్సింగ్ ను తొలగించడం తో పాటు.. ప్రగతి భవన్ ముందున్న గడీలను కూడా కూల్చివేయనున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు ప్రజాభవన్ ను సులువుగా యాక్సెస్ చేయడంలో భాగంగానే ఈ మార్పులు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.