Leading News Portal in Telugu

కేసీఆర్ కు ఆపరేషన్.. రేవంత్ స్పందన పట్ల సర్వత్రా హర్షం | revanth response on kcr| people operation| telangana| cm| people| praise| jagan| ap


posted on Dec 9, 2023 8:39AM

రాజకీయ నాయకుడికీ, నాయకుడికీ తేడా ఏమిటో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చేతలలో చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరుకూ, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే  రేవంత్ వ్యవహరిస్తున్న తీరుకూ తేడాను జనం గుర్తించారు.

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలూ సహజం. అయితే అవి అంశాల వారీగా ఆయా పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలూ, ప్రతి విమర్శలూ ఉండాలి. ఆ పరిధి దాటి వ్యక్తిగత స్థాయికి విమర్శలు దిగజారితే.. అది ఎంత మాత్రం విజ్ణత అనిపించుకోదు. అలా విమర్శలు చేసే వారు ప్రజలలో చులకన అవుతారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. విపక్షాలపై చేసే విమర్శలు ఎన్నడూ విధాన పరిధి దాటిన సందర్భం కనిపించదు. వర్తమాన రాజకీయాలలో నాయకులలో హుందాతనం ఎలా ఉండాలన్నదానికి రోల్ మోడల్ గా బాబు నిలుస్తారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా ఆ కోవలోకి వచ్చే నేతగా ఆయన వ్యవహార శైలి ఉంది.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, రేవంత్ పోటాపోటీగా ఒకరి మీద విమర్శలు చేసుకున్నారు.   ఎన్నికలు ముగిశాయి. ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపు ఉండటంతో  రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్  పార్టీ విపక్షానికి పరిమితం అయ్యింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని అంగీకరిస్తూ హుందాగా ప్రజల ముందుకో, మీడియా ముందుకో వచ్చి నూతన ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వ సారథిని అభినందించలేదు. కేసీఆర్ అనేమిటి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరూ కూడా, (హరీష్ రావు మినహాయించి) కొత్త ప్రభుత్వాన్ని అభినందించి శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు.  

అయితే రేవంత్ మాత్రం.. ఎన్నికలు పూర్తి అయిన తరువాత రాజకీయ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పాలనా వ్యవహారాలలో మునిగిపోయారు. కేసీఆర్ కు గాయం అయ్యిందనీ, ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారనీ తెలియగానే.. రేవంత్ వేగంగా స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. ఆయన చికిత్స పొందుతున్ ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని   X వేదికగా ఆకాంక్షించారు. రేవంత్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నది. ఓటమిని అంగీకరిస్తూ, కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తూ కనీసం ప్రకటన కూడా చేయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రేవంత్ కు ఉన్న తేడాను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.

అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహారశైలిని రేవంత్ తీరుతో పోల్చి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.  ఏపీలో స్కిల్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు పట్ల, ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన కుటుంబం పట్ల కూడా ముఖ్యమంత్రి జగన్,  వైసీపీ నాయకులు చేసిన చవకబారు వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. రాజకీయాలలో అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జగన్ , రేవంత్ రెడ్డి హుందాతనాన్ని చూసి నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని అంటున్నారు.