Leading News Portal in Telugu

మంత్రులకు శాఖల కేటాయింపులో రేవంత్ ముద్ర! | revanth mark in allocation portfolios| bhatti| uttam| sitakka| komatireddy


posted on Dec 9, 2023 12:02PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ప్రతి అడుగులోనూ తనదైన ముద్ర చూపుతున్న రేవంత్ రెడ్డి మంత్రికవర్గ సహచరులకు శాఖల కేటాయింపులో కూడా తనదైన ముద్ర ప్రస్ఫుటంగా కనిపించేలా నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం నుంచి, తొలి కేబినెట్ భేటీ ముగిసే వరకూ కూడా మంత్రులకు శాఖలకు సంబంధించి అనేక ఊహాగాన సభలు జరిగాయి. హై కమాండ్ ఇప్పటికే ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న విషయంలో రేవంత్ కు విస్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందనీ, ఆ మేరకు ఆయా శాఖలు కేటాయించడమే రేవంత్ పని అని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాకుండా ఎవరికి ఏ శాఖ అన్నది కూడా రెండు రోజుల కిందటి నుంచే మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.

అయితే శనివారం(డిసెంబర్ 9) ఉదయం రేవంత్ తన కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలను చూస్తే నిన్నటి వరకూ జరిగిందంతా ప్రచారం మాత్రమేనని తేటతెల్లమైపోయింది. ఈ మేరకు శనివారం ఉదయం అధికార ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన మునిసిపల్, అర్బన్ డెవలప్ మెంట్, హోం శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. వీటికి అదనంగా  ముఖ్యమంత్రి నిర్వహణలోనే  జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంది.  

ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తొలి నుంచీ రెవెన్యూ శాఖ కోసం పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. ఆర్థిక శాఖ ఇవ్వజూపినా ఆయన నిరాకరించారనీ, రెవెన్యూ కోసమే పట్టుబట్టారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కోరినట్లుగానే రేవంత్ ఆయనకు రెవెన్యూ శాఖను అప్పగించినట్లు మీడియా పేర్కొంది కూడా. తీరా శాఖల కేటాయింపు వద్దకు వచ్చేసరికి భట్టికి ఆయన కోరుకున్నట్లుగా రెవెన్యూ శాఖ కాకుండా, తొలుత రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఆర్థిక శాఖే దక్కింది. ఆర్థిక శాఖకు అదనంగా భట్టికి  ప్లానింగ్, విద్యుత్ శాఖ, ఇంధన శాఖలు కూడా కేటాయించారు. 

ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే ఆయన తొలి నుంచీ కూడా ఆర్థిక శాఖ కోసం పట్టుబట్టినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి భిన్నంగా  ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి    పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖలు కేటాయించారు. అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ, సీతక్కకు పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, 

పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మాచార శాఖ, రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖలు కేటాయించారు. అలాగే దామోదర రాజనర్సింహకు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయిం చారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించగా  పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖలు దక్కాయి.   కొండ సురేఖకు అటవీ, దేవాదాయ శాఖలు, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, టెక్స్ టైల్ శాఖలూ కేటాయిస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.  ఇక జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ కేటాయించారు.