posted on Dec 11, 2023 3:41PM
కరోనా మహమ్మారి నుంచి తేరుకునేలోగా మరోసారి చైనా నుంచి మరో అంతు చిక్కని వ్యాధి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సంగతి విదితమే. చిన్నారులే ఎక్కువగా గురౌతున్న ఈ వ్యాధి పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నా అది భారత్ లోకి ప్రవేశించేసింది. దేశ రాజధానిలో ఈ కొత్త బ్యాక్టీరిలో ఏడుగురు పిల్లల్లో గుర్తించారు.
ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ఈ వ్యాధి తీవ్రత, వ్యాప్తి తో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు నివారణ చర్యతు చేపట్టాయి. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల్లో న్యుమోనియో వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, ఊపిరితిత్తుల్లో వాపు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వైద్యులు గుర్తించారు.
ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందనీ, ముఖ్యంగా చిన్నారులకు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉందనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని మైకో ప్లాస్మా న్యుమోనియాగా గుర్తించారు. బ్యాక్టీరియా కారణంగా వస్తుందని నిర్ధారించారు. ఇప్పుడీ వ్యాధి దేశ రాజధాని ఢిల్లీలో వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.