Leading News Portal in Telugu

అమరావతి శిల్పకళ అద్భుతం… కొనియాడిన ప్రవాస బౌద్ధ పరిశోధకులు! | Amaravati sculpture is amazing| amaravati sculpture history| history of amaravati| History and Archaeology Books


posted on Dec 11, 2023 3:21PM

అమరావతి మ్యూజియంలో ప్రదర్శనలోనున్న  2000 ఏళ్ల నాటి శాతవాహన కాలపు బౌద్ధ శిల్పాలు అద్భుతమని, అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయ బౌద్ధ పరిశోధకులు భాస్కర్, తలాటం శ్రీ నగేష్ చెప్పారు. దక్షిణ భారత బౌద్ధ స్థావరాల సందర్శనలో భాగంగా వారు సోమవారం నాడు అమరావతి స్థూపాన్ని, మ్యూజియాన్ని చూశారు. ప్రముఖ బౌద్ధ నిపుణుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి వారికి అమరావతి చరిత్ర, ధరణికోట చరిత్ర, బౌద్ధ స్తూపం, మ్యూజియంలోని బుద్ధుని శిల్పాలు, శిలాఫలకాలు, శాసనాలు, ధాతుపేటికల వివరాలను తెలియజెప్పారు.

మహాస్తూపం వద్ద గల అతిపెద్ద స్తంభం మీద శాతవాహనుల కాలపు బుద్ధుని అసంపూర్ణ రేఖా చిత్రం ఉందని, ఇది 2000 సంవత్సరాల నాటి శిల్పుల పనితనానికి అద్దం పడుతుందని వారికి వివరించారు. దక్షిణాపధ రాజధానిగా విలసిల్లిన ధాన్యకటకంలోని మట్టి కోట గోడను కాపాడుకోవాలని ఆయన అన్నారు.

 మ్యూజియం ఇంచార్జ్ చిన్నబాబు ప్రవాస బౌద్ధ పరిశోధకులకు స్వాగతం పలికి మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న పురావస్తువుల గురించి వివరించారు. మ్యూజియాన్ని శుభ్రంగా, చక్కగా నిరవహిస్తున్నారని చిన్నబాబును భాస్కర్, శ్రీ నగేష్, ఈమని శివనాగిరెడ్డి అభినందించారు. అనంతరం వారు అమరావతికి చెందిన ప్రముఖ బౌద్ధ రచయిత వావిలాల సుబ్బారావును కలుసుకొని ఆచార్య నాగార్జునని రచనలపై చర్చించారు.