మంగళగిరి వైసీపీ ఖాళీ?.. అదే దారిలో గాజువాక? | mangalagiri ycp empty| gajuwaka| mla| son| resign| disaccord| jagan| party| state
posted on Dec 11, 2023 2:56PM
వైసీపీ నుంచి వలసలు గట్టు తెగిన వరద గోదారిలా సాగుతున్నాయి. ఇంత కాలం అసమ్మతిని, అసంతృప్తిని పంటిబిగువున దాచుకుని పిల్లిమెడలో గంట కట్టేదెవరన్నట్లుగా ఉన్న వైసీపీ నేతలకు ఆ గంట కాస్తా కట్టేసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దారి చూపారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, శాసన సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఫార్మాట్ లో అందించారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రాజీనామా వేనుక విపక్ష తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాన్న కుట్ర ఉందన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది. ఆళ్ల దారిలో మరి కొందరు కూడా నడుస్తారనీ, వారి వారి నియోజకవర్గాలలో బీసీలను నిలబెడతామన్న ప్రచారం ద్వారా వైసీపీ తెలుగుదేశం బీసీ బేస్ ను బద్దలు కొట్టాలన్న కుట్రలో భాగమే ఆళ్ల రాజీనామా అన్న ప్రచారం ఒక పక్క జరుగుతోంది.
అది పక్కన పెడితే ఆళ్ల రాజీనామాతో మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోతుందా అన్న రీతిలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇలా ఆళ్ల రాజీనామా చేయగానే అలా నియోజకవర్గ పరిధిలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రాజీనామాల బాట పట్టారు. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడు, జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండలం కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి తమ తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవి నియామకం ఖరారైన నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారని అంటున్నారు.
అసలు గంజి చిరంజీవి వైసీపీలో చేరిన నాటి నుంచే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి మంగళగిరిలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఇక అనివార్యంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారని అంటున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించిన తరువాత జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందని అంతా భావించారు. అప్పుడే కాదు, ఆ తరువాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనూ ఆళ్లకు జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకింత అసంతృప్తికి లోనైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని తేలడంతో పార్టీ నుంచి వైదొలిగారు. అయితే వైసీపీలో ఈ రాజీనామాల పర్వం ఒక్క మంగళగిరి నియోజకవర్గంతో ఆగదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే గాజువాక నియోజకవర్గం నుంచి కూడా రాజీనామాల పర్వం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే తిప్పన కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిలాగే జయంట్ కిల్లర్. గత ఎన్నికలలో ఆయన గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విజయం సాధించారు. జయంట్ కిల్లర్ గా తనకు జగన్ కేబినెట్ లో స్థానం కల్పిస్తారని ఆశించారు. అయితే జగన్ అసలు తిప్పన పేరునే పరిశీలించలేదు. ఇక పోతే ఏడు పదులు పైబడిన వయస్సున్న తిప్పన వచ్చే ఎన్నికలలో తనకు బదులుగా తన కుమారుడు తిప్పన దేవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇంతలో ఏమైందో కానీ ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసేశారు. మొత్తంగా ఇంత కాలం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్నఅసంతృప్తి ఇప్పుడు నిప్పుల గుండంగా బయటపడుతోందని, ఈ రాజీనామాల పర్వం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు విస్తరించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.