కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్.. మతలబేంటి? | revanth strategy behind visit kcr in hospital| yashoda| political| values
posted on Dec 12, 2023 11:28AM
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగి ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కు ప్రముఖుల నుండి పరామర్శల వెల్లువ కొనసాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ మళ్ళీ త్వరగా కోలుకుని అసెంబ్లీ అడుగుపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. మంత్రి సీతక్క, షబ్బీర్ అలీతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సీఎం ఆసుపత్రి ఎండీ జి.సురేందర్ రావు, సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు, డాక్టర్ జి.దేవందర్‌రావులతో కేసీఆర్ ఆరోగ్యంపై చర్చించారు. అక్కడ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను సీఎం కలుసుకోగా.. కేటీఆర్ భుజం తట్టి రేవంత్ ధైర్యం చెప్పారు. ఆసుపత్రి బయట రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించాం. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నామని.. మంచి పాలన అందించడానికి ఆయన సలహాలు అవసరం అని అన్నారు.
అయితే సీఎం రేవంత్ కేసీఆర్ ను పరామర్శించడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా బద్ద శత్రువులుగా కనిపించడం.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ పరిణామం కావడంతో రాజకీయ వర్గాలు కూడా ఈ సందర్భాన్ని ఆసక్తిగా పరిశీలించాయి. పరిధి దాటి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఇప్పుడు ఈ పరామర్శను పరిశీలకులు సైతం రకరకాల కోణాలలో విశ్లేషిస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చర్చ కూడా జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ప్రతి పక్షంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అడుగు అడుగునా అడ్డంకులు సృష్టించి ఇబ్బంది పెట్టింది. అక్రమ కేసులు పెట్టి వేధించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ను ఇలా రేవంత్ రెడ్డి పరామర్శించడాన్ని కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా అర్ధం చేసుకోగలరు? లేదా అసలు ఏదైనా వ్యూహంలో భాగంగానే ఈ పని చేశారా అనే భావనలు చర్చకు వస్తున్నాయి. అసలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ ను కనీసం అభినందించని కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడమేంటని కొందరంటుంటే.. అలా పరామర్శించి కేసీఆర్ అహంకారంపై రేవంత్ దెబ్బ కొట్టారని కొందరంటున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని సమర్ధించేవాళ్లు ఎంత మంది ఉన్నారో.. వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. వీరిలో కాంగ్రెస్ పైన ప్రేమ, రేవంత్ రెడ్డి పైన అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. రేవంత్ చేసిన ఈ పని అణగారి పోతున్న రాజకీయ విలువలకు ప్రాణం పోసినట్లుగా కొందరు విశ్లేషిస్తుంటే.. ఇది కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమే అన్నట్లుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో ప్రతి క్షణం నిప్పులు చెరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించి సమాజానికి ఏం సందేశమిచ్చారని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే లెక్కలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగిన కార్యకర్తలు కొందరు ఇప్పుడు రేవంత్ కేసీఆర్ ను పరామర్శిండాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు. కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ ను సోషల్ మీడియాలో కొందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాజకీయాలలో విమర్శలతో పాటు విలువలు కూడా ఉండాలని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ ను భుజాల మీద మోసిన కార్యకర్తలు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు.
రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏపీ నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డికి రిప్లై ఇచ్చిన రేవంత్.. చంద్రబాబు, లోకేష్ కి రిప్లై ఇవ్వలేదు. ఇది కూడా ఏదైనా వ్యూహంలో భాగమా అనేది కూడా చర్చ కూడా జరుగుతున్నది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేలా కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లింది. అయితే, రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు జరిగే పరిణామాలను ఆయుధంగా తీసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనేలా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఏపీ నేతలతో ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేనేమో రేవంత్ అండ్ కో తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ నేతలతో ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ విలువల పేరిట రాజకీయాలలో కొత్త ఒరవడికి తెరతీస్తున్నట్లే కనిపిస్తుంది. అయితే, మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు వెలికి తీసే విషయంలో మాత్రం రేవంత్ కరుకుగా, కఠినంగా ఉండాలని పరిశీలకులు అంటున్నారు. సామాన్య ప్రజలూ అదే కోరుకుంటున్నారు.