posted on Dec 13, 2023 9:49AM
ఆంధప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం(డిసెంబర్ 13), గురువారం(డిసెంబర్ 14) కేంద్ర బృందం పర్యటించనుంది. ప్రభావిత జిల్లాల్లో నష్టపోయిన పంటలు, ఇతర ఆస్తులను అధికారులు అంచనా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర బృందం బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది.
బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికారుల బృందం పరిశీలన చేయనుంది. పరిశీలనకు ముందు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌తో భేటీకానుంది. రెండు బృందాలు ఏర్పడి ప్రభావిత ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోనున్నారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు.
దీని ప్రభావం తగ్గినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. తుపాను కారణంగా ఏర్పడిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడులో ఇప్పటికే పర్యటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులు మనో ధైర్యాన్ని కోల్పోకూడదని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమం పూర్తిగా మర్చిపోయిందన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించే వరకు ముఖ్యమంత్రి జగన్ కు సోయి లేదన్నారు.