posted on Dec 13, 2023 3:41PM
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ… ప్రగతి భవన్ ను గడీగా పోల్చింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించింది. అయితే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చేసింది. ఇది ప్రజా భవన్‌గా మారిన తర్వాత చాలాకాలంగా ఇక్కడ ఉన్న ఇనుప కంచెను తొలగించారు. సామాన్య ప్రజలు వచ్చేలా ప్రజా దర్భార్ కేంద్రంగా మార్చారు. మొదటి రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఇక తర్వాత… ప్రతిరోజూ ఒక మంత్రి స్వయంగా… ప్రజాదర్భార్ లో పాల్గొని… ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఇక గత ప్రభుత్వంలో… ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది.మరోవైపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ్నుంచి కార్యకలాపాలను నిర్వహించే ఆలోచనలో లేరని తెలుస్తోంది.సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే… డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్ ను కేటాయించటంతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వినియోగించటం దాదాపు ఖాయమని తెలుస్తోంది.ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు భద్రతాపరంగా అనుకూలంగా ఉంది. వాహనాల పార్కింగ్‌కూ అనుకూలంగా ఉంది. దీంతో ఇక్కడే ఉండాలని చాలామంది సీఎం రేవంత్ రెడ్డికి సూచించారని చెబుతున్నారు.