స్మోక్ బాంబులతో లోక్ సభలో అగంతకుల దాడి.. కొత్త పార్లమెంటులో భద్రత డొల్లేనా? | attack in loksabha| central| vista| security| breach| same| day| 22years| terror| attack
posted on Dec 13, 2023 2:08PM
దేశ అత్యున్నత చట్ట సభ అయిన లోక్ సభకు భద్రత డొల్లేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత ఆధునిక సాంకేకిత పరిజ్ణానంతో, పటిష్ఠ భద్రతతో నిర్మించామనీ, వచ్చే వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించామని చెప్పుకుంటున్న పార్లమెంటు భవనంలో అగంతకులు స్మోక్ బాంబులతో చెలరేగిపోయారు. శీతాకాల సమావేశాలలో భాగంగా బుధవారం (డిసెంబర్ 13) లోక్ సభలో జీరో అవర్ జరుగుతున్న సమయంలో ఓ ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీలోనుంచి నేరుగా సభలోకి దూకారు. తరవాత టియర్ గ్యాస్ ప్రయోగించారు. కలర్ స్మోక్ ప్రయోగించడంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు సభలోనే ఉన్నారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎంపీలకు చాలా సమయం పట్టింది. ఓ దండగుడు లోక్ సభపైనే దాడి చేసినట్లుగా గుర్తించారు.
సరిగ్గా 22 ఏళ్ల కిందట ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. ఆ దాడి జరిగిన డిసెంబర్ 13నే ప్రస్తుతం సభలో టియర్ గ్యాస్ దాడి జరగడం యాథృచ్ఛికమా? లేక రెంటికీ ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నాడు ఉగ్రవాదులు మారణాయుధాలతో దాడి చేస్తే ఇప్పుడు ఇద్దరు ప్రాణాహాని కలిగించే ఆయుధాలను ఉపయోగించలేదు. కేవలం సంచలనం సృష్టించడమే లక్ష్యం అన్నట్లుగా ఈ దాడి ఉంది.
అన్నిటికీ మించి దాడికి పాల్పడిన నీలం కౌర్, షిండే అనే ఈ ఇద్దరు తానా షాహీ బంద్ కరో.. జై భీమా.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వీరిరువురూ కూడా మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప సింహ పాసులతో విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు. ఈ ఇద్దరూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. మొత్తం మీద మోడీ తన మానస పుత్రికగా పేర్కొని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివర్ణించిన సెంట్రల్ విస్టాలో భద్రతా వైఫల్యం ఈ సంఘటనతో ప్రస్ఫుటంగా బయటపడింది.