Leading News Portal in Telugu

స్మిత సబర్వాల్ ఎక్కడ ? | smita sabarwal versus revanth reddy


posted on Dec 13, 2023 1:34PM

కొత్త ప్రభుత్వం కొలువు తీరి వారం రోజులు కావొస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్  మర్యాదపూర్వకంగా కలవలేదు. కెసీఆర్ ప్రభుత్వంలో చాలా కీలకంగా పని చేసిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఏమైంది అనే చర్చ జరుగుతుంది. 

 ప్రభుత్వం మారిన సందర్భంలో పాలనాధికారులు కొత్త ముఖ్యమంత్రిని కలవడం ఆనవాయితీ.. అయితే, స్మిత సబర్వాల్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. నీటి పారుదల శాఖపై సీఎం జరిపిన సమీక్షకు కూడా ఆమె హాజరుకాకపోవడం సర్వత్రా చర్చకు దారితీసింది.తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తున్నారు.ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా  పని చేసారు. ఈ ఐఏఎస్ అధికారి మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రకటించింది. రేవంత్ రెడ్డి టీమ్ లో ఈ ఐఏఎస్ అధికారి ఉండరని అప్పట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసులకు పని చేయాలని స్మిత సబర్వాల్ నిర్ణయించుకున్నారు.  తాజాగా, కొత్త చాలెంజ్ లకు సిద్ధమంటూ స్మిత సబర్వాల్ ఓ ట్వీట్ చేయడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. స్మిత కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం పనులను పర్యవేక్షించారు.  2001లో ట్రైనీ కలెక్టర్ ఐఏఎస్ విధుల్లో చేరిన స్మిత సబర్వాల్.. మెదక్ జిల్లా కలెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఆరోపించారు. ఈ అక్రమాలలో అధికారులకూ వాటా ఉందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉంటోందనే వాదన వినిపిస్తోంది.