మంత్రి సీతక్క చాంబర్ లో స్మితా సభర్వాల్ ప్రత్యక్షం | senior ias officer smita sabharwal in minister| sitakka| chamber| kcr| government| cmo| irrigation| meet
posted on Dec 14, 2023 11:41AM
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ గురించి తెలియని వారు వుండరు ..ప్రభుత్వం మారిన తరువాత కొత్త సీఎంను ఇప్పటి వరకూ కనీసం కలవని ఆమె గురువారం (డిసెంబర్ 14) హఠాత్తుగా మంత్రి సీతక్క చాంబర్ లో ప్రత్యక్షమయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సంప్రదాయాన్ని పాటించి కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపాల్సిన బాధ్యతను కూడా విస్మరించిన స్మితా సభర్వాల్ డెప్యుటేషన్ పే కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ గా తాను రాష్ట్రంలోనే ఉంటానని స్మితా సభర్వాల్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత స్మితా సభర్వాల్ రేవంత్ ను కలవకపోవడమే కాదు, ఆయన ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షకు కూడా డుమ్మా కొట్టారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. దీంతోనే ఆమె కేంద్ర సర్వీసులకు వెడుతున్నారన్న వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన స్మితా సభర్వాల్ సీతక్క మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె ఛాంబర్ కు వచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టని సీతక్కను అభినందించారు.
పోనీ సీతక్క ఇరిగేషన్ మంత్రి కనుక స్మతి ఆ కార్యక్రమానికి హాజరయ్యారనుకునేందుకు లేదు. ఎందుకంటే సీతక్క మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి. దీంతో సీఎంను కలవకుండా ముఖం చాటేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలిసి అభినందనలు తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.