హోదా ఏదీ?.. ఢిల్లీలో మళ్లీ గళమెత్తిన చలసాని! | chalasani raise voice for aps special status| delhi| joint| action| committee| 10years| fight
posted on Dec 14, 2023 10:27AM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రత్యేక హోదా సాధన విద్యార్థి, యువజన రాష్ట్ర ఐకాస నాయకులు మరోసారి ఢిల్లీలో గళం వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో దిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, విద్యార్థి యువజన జేఏసీ నేత కన్వీనర్ షేక్ జిలాని పలువురు పాల్గొన్నారు. ఢిల్లీలో ధర్నాతో పాటు అంతకు ముందే చలసాని నేతృత్వలో సిపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలువురు జాతీయ నేతలను కూడా కలిశారు.
ధర్నాలో పాల్గొన్న ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భావితరాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా విభజన హామీలన్నీ అమలు కావాలని, దాని అమలు కోసం ఉద్యమించని వాళ్ళు ఆంధ్ర ద్రోహులేనన్నారు. విభజన హామీల అమలు కోసం ఎక్కడా గడువులు పెట్టలేదని గుర్తు చేశారు. అలాగే 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. భావితరాలకు అవసరమైన విషయాలను విస్మరించి ప్రతిపక్షనేతలపై కక్షసాధింపుపై దృష్టి పెట్టడం అన్యాయం, రాష్ట్రానికి నష్టం అని విమర్శించారు. ప్రధాని మోడీ ఏపీ ప్రధాన రాజకీయ నాయకులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తోలు బొమ్మలాటలు ఆడిస్తున్నారని, అది మంచిది కాదని చలసాని అన్నారు. 2019 ముందే కాదు తరువాత కూడా ఏ రోజూ తమ ఉద్యమం ఆపలేదని చలసాని గుర్తు చేశారు.
నిజానికి ఒక్క ప్రత్యేక హోదా మాత్రమే కాదు.. విభజన అనంతరం ఏపీకి దక్కాల్సిన హామీల అమలుపై చలసాని ఎప్పటి నుండో పోరాటాలు చేస్తున్నారు. విజయవాడ, విశాఖ లాంటి ఏపీలోని ప్రధాన నగరాలతో పాటు ఢిల్లీలో కూడా పలుమార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హోదా కావాలంటూ పదే పదే ఢిల్లీలో వచ్చి కేంద్రాన్ని అడుక్కోలేమని.. కావాలంటే ప్రధాని మోడీ ఏపీ ప్రజల రక్తాన్ని తీసుకొని హోదా ఇవ్వాలని గతంలో సంచలన ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేక హోదా అనేది తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని, కేంద్ర పెద్దలు ఆ ఆత్మగౌరవంపై ప్రతిసారి దెబ్బకొడుతున్నారంటూ పలుమార్లు ఢిల్లీలో గళం వినిపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రత్యేక నిధులు ఇలా విభజన హామీలపై చలసాని శ్రీనివాస్ గత పదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రాజధాని అమరావతిపై కూడా చలసాని పోరాటం చేస్తూనే ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించి.. హామీని మరవడంపై చలసాని తొలి నుండి గళమెత్తుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఢిల్లీలో మరోసారి ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణ చేపట్టారు. అటు జాతీయ స్థాయి నేతలతో పాటు తెలంగాణ నేతల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే క్రమంలో గత నాలుగేళ్లుగా జగన్ సర్కార్ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టడంపై కూడా సమయం వచ్చిన ప్రతిసారి విమర్శిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తున్న చలసానిపై పలుమార్లు పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టారు. చలసాని నిరసనలకు అనుమతిచ్చేది లేదంటూ ఆంక్షలు విధించారు. కానీ, ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదంటూ చలసాని తమ పోరాటాలను సాగిస్తున్నారు. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి ఉద్యమ బాట పట్టారు. మరి కేంద్రం ఈ పోరాటం, ప్రత్యేక హోదాపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక చలసాని అయితే ఓ పైవు ఏపీ భవిష్యత్ క్రాంతి, కాంతి అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూనే మరో వైపు నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విజయవాడ నగరంలో నిరంతరాయంగా 24 గంటలు చల్లటి మినరల్ వాటర్ అందించడంతో పాటు విజయ బ్రాండ్ మజ్జిగ పంపిణీ, ప్రతి శనివారం, ఇతర ముఖ్యదినాల్లో అన్నదానం కార్యక్రమాలను తన కుమార్తె శిరీష్మా జ్ఞాపకార్థం సొంత వ్యయంతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తూనే, పేదల కోసం సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న చలసానిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.